ఎక్కడ, ఎందుకు, ఎలా పుట్టిందో తెలీదు గానీ.. `ఎన్టీఆర్` బయోపిక్‌లో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నాడన్న వార్త బయటకు వచ్చింది. బహుశా… `అరవింద సమేత` సక్సెస్ మీట్‌కి బాలకృష్ణ రావడం చూసి – బాలయ్య, ఎన్టీఆర్‌లు కలిసిపోయారోచ్ అనుకుని, ఇలా కలిసిపోయారు కాబట్టి – త్వరలో కలసి నటించేస్తారు అని కూడా అనేసుకుని.. దానికి `ఎన్టీఆర్` బయోపిక్‌కీ లింకులు ఎట్టేశారన్నమాట.
`ఎన్టీఆర్` బయోపిక్‌లో ఎవరెవరు, ఏయే పాత్రలు చేస్తున్నారన్న విషయంలో ఎప్పుడో క్లారిటీ వచ్చేసింది. ఇందులో కొత్త పాత్రలేం లేవు. ఎన్టీఆర్ చేయదగిన పాత్ర అస్సలు లేదు. అలాంటప్పుడు ఈ వార్త ఎందుకు పుట్టిందో. ఎన్టీఆర్ గనుక అడుగుపెడితే ఈ సినిమాకి ఇంకాస్త ఎక్కువ రేట్లకు అమ్ముకోవచ్చన్న పాయింట్ కూడా కరెక్ట్ కాదు.ఎందుకంటే.. `ఎన్టీఆర్` బయోపిక్ కి ఈ సినిమా స్థాయికి మించిన రేట్లు వస్తున్నాయి. రెండు భాగాలుగా తీస్తున్నారు కాబట్టి.. రెండింతల రాబడి. ఇవన్నీ ఉండగా జూనియర్ని కూడా క్యాష్ చేసుకుందామన్న ఆలోచనలో బాలయ్య ఉంటాడా..?
పైగా… `అరవింద సమేత` సక్సెస్ మీట్లో బాలకృష్ణ స్పీచు, ఎన్టీఆర్ మాటలు, వాళ్లిద్దరి `అవినాభావ సంబంధం` చూసినవాళ్లకెవరికైనా `ఎన్టీఆర్‌లో ఎన్టీఆర్ నటిస్తాడ`న్నది పెద్ద జోక్‌గా కనిపిస్తుంది. ఒక వేదికపై నందమూరి హీరోల్ని చూస్తే చూడొచ్చు గాక.. ఒకరి మనసులో మరొకరికి ఎంత చోటున్నది అనేది వాళ్ల మాటల్ని బట్టి తేలిపోయింది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ బయోపిక్‌లో ఎన్టీఆర్ నటిస్తున్నాడన్న వార్త… కేవలం గాలివాటంగా వచ్చిందే అనిపిస్తోంది. ఆ మాట కొస్తే ఎన్టీఆర్ బయోపిక్‌కి పనిచేస్తున్న కొంతమంది కీలకమైన సాంకేతిక నిపుణులు కూడా ఈ మాటే అంటున్నారు. ఇదో గాలి వార్త అని కొట్టిపరేస్తున్నారు.