తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు ఓ సంచలనం. తనపై, తన బంధువుల ఇళ్లపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులు చేయించాలని కేసీఆర్… మోడీకి విజ్ఞప్తి చేసుకున్నారని దాని ప్రకారం… తన అరెస్ట్‌కు రంగం సిద్ధం చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించిన.. కొద్ది రోజుల్లోనే అది నిజమయింది. కొడంగల్ ఎన్నికల ప్రచారంలో ఉండగా.. రేవంత్ ఇంటిపై ఐటీ,ఈడీ దాడులు జరిగాయి. ఉన్న పళంగా రేవంత్ ను హైదరాబాద్ పిలిపించి మూడు రోజుల పాటు సోదాలు చేశారు. ఇక అరెస్ట్ చేయడమే మిగిలింది అన్నట్లుగా హడావుడి చేశారు. కానీ… ఇంత వరకూ రేవంత్ చేసిన అక్రమాలేమిటో.. అక్రమ సంపాదన ఏమిటో .. అసలు ఏం దొరికిందో.. ఐటీ నుంచి అధికారిక ప్రకటన రాలేదు.
ఐటీ అధికారులిచ్చిన పంచనామా పత్రాల్లో ఏముంది..?
ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్యూలో రేవంత్ రెడ్డి… ఐటీ అధికారులకు తన ఇంట్లో ఏం దొరికాయన్నదానిపై క్లారిటీ ఇచ్చారు. రూ. రెండు లక్షలు నగదు ఉందని.. అది కూడా పరిమితిలోనే ఉందని.. పంచనామాలో రాసిచ్చినట్లు చెప్పారు. ఆస్తి కూడా పరిమితిలోనే ఉందని రాశారు. ఆస్తి కాగితాలు తీసుకున్నారు. గోల్డ్ ఆర్నమెంట్స్ కు సంబంధించి వివరాలు తీసుకున్నారు తప్ప.. అక్రమాస్తులు ఎక్కడా లేవని.. పంచనామా పత్రం ఇచ్చినట్లు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే.. చివరిగా ఆ రూ.50లక్షలు ఎక్కడివని అడిగారన్నారు అది ఏసీబీ కేసు.. కోర్టులో ఉంది. ఆదాయ పన్ను శాఖ వారు అడిగితే నాది కాదు అన్నా. అయినా, లేదు లేదు మీదే అన్నారు. దీంతో, మరి ఆ డబ్బులో 30 శాతం పన్ను తీసుకొని మిగతా డబ్బు ఇవ్వాలని అడిగారట రేవంత్.
మీడియాలో ప్రసారమైన పత్రాలేంటి..?
వాస్తవానికి రేవంత్ రెడ్డి అటు సోదాలు చేస్తున్న సమయంలో కొడంగల్ నుంచి ఇంట్లోకి వెళ్లగానే… ఇటు మీడియాలో హడావుడి ప్రారంభమయింది. రూ. వెయ్యి కోట్లు అక్రమాస్తులంటూ బ్రేకింగ్న్యూస్లతో హడావుడి చేశారు. విదేశాల్లో రెండు, మూడు ఆస్తులు అమ్మినట్లుగా… ఆ సొమ్మును.. అక్కడ్నుంచి ఇండియాకు తరలించినట్లుగా మాత్రమే చూపించారు. విదేశీ ఖాతాలు.. ఆస్తులు.. అంటూ… విపరీతంగా ప్రచారం జరిగింది. ఇంకా ఇందులో… ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఏఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారో కూడా ప్రకటించారు. కానీ ఇంత వరకూ అప్పుడు మీడియాలో వచ్చిన నిజం అని కానీ.. అబద్దం కానీ చెప్పలేదు. నిజం కాదని.. రేవంత్ రెడ్డి బయటకు వచ్చారు. ఒకవే అబద్దం అయితే.. ఐటీ పేరుతో… ఈ పని చేసిన వారిని ఎందుకు అలా వదిలి పెట్టారన్నది.. ఎవరికీ క్లారిటీలేదు.
జీవీఎల్ చెబుతున్నదేమిటి..?
మరో వైపు… ప్రధానమంత్రి నరేంద్రమోడీ, అమిత్ షాలకు.. అత్యంత నమ్మకస్తునిగా ఉంటూ..తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కీలక పాత్రపోషిస్తున్న జీవీఎల్ నరసింహారావు ఐటీ శాఖ లీక్ చేసిందంటూ కొన్ని పత్రాలు బయటపెట్టారు. అందులో రూ. 10 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఐటీ పేరుతో… జీవీఎల్ చాలా ఆరోపణలు చేశారు. దానిపై.. రేవంత్ నిరూపించాలని సవాళ్లు కూడా చేశారు. కానీ ఆయన అది మీడియాలో వచ్చిందంటూ తప్పించుకున్నారు.
ఐటీ దాడుల వెనుక అంతా రాజకీయమేనా..?
వరుసగా చోటు చేసుకున్న ఐటీ సోదాలు.. పంచనామా రిపోర్టుల తర్వాత దర్యాప్తు సంస్థలు నెమ్మదించినట్లు కనిపిస్తున్నాయి. అయితే ఐటీ పేరుతో… రాజకీయం మాత్రం జోరుగా నడుస్తోంది. ఈ మొత్తం చూస్తే.. రేవంత్ రెడ్డి భుజంపై నుంచి…రాజకీయంగా… చంద్రబాబును టార్గెట్ చేసుకున్నారనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వస్తున్నాయి.