బయోపిక్ అంటే.. జీవితంలోని అన్ని పార్శ్వాల్నీ, అన్ని కోణాల్నీ చూపించాలి. అప్పుడే దానికి సార్థకత. ప్రస్తుతం క్రిష్ అదే పని చేస్తున్నట్టు అనిపిస్తోంది. ఆయన తెరకెక్కిస్తున్న `ఎన్టీఆర్` బయోపిక్‌లో ఎన్టీఆర్‌కి సంబంధించిన సమస్త కోణాల్నీ ఆవిష్కరిస్తున్నారు. ఉదాహరణకు.. ఎన్టీఆర్‌కు జాతకలంటే పిచ్చి. ఏ పనైనా శాస్త్ర ప్రకారం చేస్తుంటారు. ఆయనకు ఓ వ్యక్తిగత జ్యోతిష్యుడు ఉండేవారు. పేరు… భూతాల రాజు. ఎన్టీఆర్ తన ముఖ్యమైన పనులన్నీ భూతాల రాజు నిర్దేశించిన ముహూర్తానికే జరిపేవారు. ఎన్టీఆర్ బయోపిక్‌లోనూ ఈ పాత్ర ఉంది. ఎన్టీఆర్‌కి జాతకాలపై మమకారం ఎలాంటిదో ఈ పాత్ర ద్వారా చూపించబోతున్నారు.
ఎన్టీఆర్‌నీ అభిమానుల్నీ వేరు చేయలేరు. `అభిమానులే నా దేవుళ్లు` అని చెప్పుకునే ఎన్టీఆర్ జీవితంలో అభిమానులకు సుస్థిరమైన స్థానం ఉంది. ఎన్టీఆర్ అభిమాన గణంలో ముఖ్యుడు కుంటి సాయి. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కుంటి సాయికి కూడా ఓ పదవి లభించింది.దాన్ని బట్టి… అభిమానులకు ఎన్టీఆర్ ఇచ్చిన స్థానమేంటో అర్థమవుతుంది. అసలు కుంటి సాయి ఎవరు? ఎన్టీఆర్‌కు ఎందుకు అభిమానిగా మారాడు? కుంటి సాయి అనే అభిమాని ఎన్టీఆర్ దృష్టిలో ఎలా పడ్డాడు? అనేది ఆసక్తికరమైన ఎపిసోడ్. అది కూడా ఎన్టీఆర్ బయోపిక్‌లో చూపిస్తున్నారు. కుంటి సాయి ఎపిసోడ్ అంతా పార్ట్2లో రాబోతోంది.