ఆంధ్రప్రదేశ్ భాజపా నేతలకు ఇన్నాళ్లకి అగ్రిగోల్డ్ బాధితులు గుర్తొచ్చినట్టున్నారు..! బాధితులకు అండగా ఉంటామంటూ విజయవాడలో రిలే నిరాహర దీక్షలు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి భాజపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతోపాటు ఎంపీ జీవీఎల్, జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ కూడా పాల్గొన్నారు. ఏతావాతా అందరూ మాట్లాడిందీ ఒకటే… అగ్రిగోల్డ్ వ్యవహారంలో పెద్ద స్కామ్ ఉందనీ, ఆ సంస్థ ఆస్తుల్ని చౌకగా కొట్టేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారనీ, వారికి టీడీపీ అండగా ఉంటోందనీ విమర్శలు గుప్పించారు. ఒక భాజపా నాయకుడైతే, అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామని 2014లో టీడీపీ మేనిఫెస్టోలో కూడా పెట్టారుగానీ, అమలు చేయలేదని విమర్శించేశారు..! అప్పటికా సంక్షోభమే లేదన్న విషయం ఆయనకి తెలియదేమో మరి!
అగ్రిగోల్డ్ వ్యవహారం 2015 నుంచి నలుగుతున్నదే. అయితే, ఇన్నాళ్లూ మౌనంగా ఉండి ఇప్పుడు కొత్తగా బాధితుల మీద భాజపా ప్రేమ కురిపిస్తూ ఉండటం గమనార్హం! దానికి కారణం కూడా లేకపోలేదు. అగ్రిగోల్డ్ ఖాతాదారుల్లో దాదాపు 28 లక్షల మంది ఆంధ్రాలో ఉన్నారు. ఓట్ల పరంగా చూసుకుంటే చాలా పెద్ద నంబర్ అది. సో.. వారిందరికీ ఏదో న్యాయం చేస్తామన్న భరోసా ఇవ్వడం ద్వారా తమవైపు ఆకర్షించుకోవాలన్న రాజకీయపు ఎత్తుగడే భాజపా పోరాటం వెనకున్న లక్ష్యం అనేది స్పష్టంగానే అర్థమౌతోంది. ఇంకోటి… అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం ప్రక్రియ అంతా హైకోర్టు ఆదేశాల ప్రకారం సీబీసీఐడీ చేస్తోంది. అంతేగానీ, ఇప్పుడు భాజపా నేతలు ఆరోపిస్తున్నట్టుగా ఇందులో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయంతో ఇష్టం వచ్చినట్టుగా ఆస్తులను ధరలు పెంచుతూ, లేదా తగ్గించే విధంగా వ్యవహరించే ఆస్కారం ఎక్కడుంది..? ఆ సంస్థ ఆస్తుల్ని కొనడానికి కోర్టు ద్వారానే ఎస్.ఎల్. గ్రూపు ముందుకొచ్చింది, కొంత సొమ్ము డిపాజిట్ కూడా చేసింది. ఆ తరువాత, గ్రూపు బయటకి వెళ్లిపోయింది. దీన్లో రాష్ట్ర ప్రభుత్వం పాత్రేముంది..?
అయితే, భాజపా నేతలు ఏమంటున్నారంటే… కోర్టు నిర్దేశం ప్రకారం వేలం వేస్తున్నా సరే, ఆ ఆస్తుల్ని ఎవ్వరికీ దక్కనీయకుండా టీడీపీవారు అడ్డుకుంటున్నారని! తాము 2019లో అధికారంలోకి వస్తాం కాబట్టి, బాధితులందరికీ వెంటనే న్యాయం చేసేస్తామని హామీలు ఇస్తున్నారు. అయితే, ఇక్కడ వారు ఆరోపిస్తున్న వేలం ప్రక్రియ కూడా ఆన్ లైన్ విధానంలో జరుగుతోందనే విషయాన్ని భాజపా నేతలు గుర్తించినట్టు లేదు. ఇంకోటి, రాబోయే ప్రభుత్వం తమది కాబట్టి, బాధితులను న్యాయం జరిగిపోతుందని జీవీఎల్, రామ్ మాధవ్ లు హామీలు ఇచ్చేశారు. అది కోర్టులో ఉన్న వ్యవహారం అని మరచిపోయి మరీ ఇలా హామీలు ఇచ్చేస్తే ఎలా..? అయినా, అగ్రిగోల్డ్ బాధితులపై నిజంగానే అంత ప్రేమ ఉంటే… కేంద్రంలో అధికారంలో ఉన్నది భాజపా ప్రభుత్వమే కదా, అక్కడి నుంచీ ఏవైనా నిర్ణయాలు తీసుకునేలా ఒత్తిడి పెంచాలి. అంతేగానీ, రాష్ట్ర స్థాయిలో కూర్చుని వైకాపా, జనసేనలు చేసిన పాత ఆరోపణల్నే మళ్లీమళ్లీ చేస్తూ ఉద్యమిస్తామంటే భాజపాది రాజకీయం కాకపోతే ఇంకేమనాలి..?