టీఆర్ఎస్ అభ్యర్థి పిడమర్తి రవి నాకంటే మంచివాడు, సత్తుపల్లి నియోజకవర్గంలో టీఆర్ఎస్ గెలవకపోతే వచ్చే మంత్రి వర్గంలో తాను ఉండనంటూ.. ఆపద్ధర్మ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎమోషనల్ బ్లాక్‌మెయిలింగ్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. దీనిని అక్కడి ఓటర్లు ఎంత వరకు పరిగణనలోకి తీసుకున్నారో కానీ… టీఆర్ఎస్ పరిస్థితి మాత్రం రోజు రోజుకు దిగజారిపోతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా… టీడీపీలోకి అంతకంతకూ వలసలు పెరుగుతున్నాయి. నియోజకవర్గంలో ఐదు మండలాలుండగా తుమ్మల సామాజిక వర్గం ప్రాబల్యం, ఆయన సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న సత్తుపల్లి మండలంలో టీఆర్ఎస్ నుంచి టీడీపీలోకి వలసలు పెరుగుతున్నాయి. గత వారం రోజుల్లో నగర పంచాయతీ వైస్ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు సహా పలువురు ద్వితీయ శ్రేణి నేతలు టీడీపీలో చేరారు. కొంత మందిని తుమ్మల పిలిపించుకుని బుజ్జగించారు. వారు తాత్కాలికంగా ఆగినా… పార్టీని వదిలి వెళ్ళే ఆలోచనలో ఉన్నట్లు సత్తుపల్లిలో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పలు గ్రామాల్లో మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు టీడీపీ గూటికి చేరారు. మరో రెండు రోజుల్లో రేజర్ల గ్రామానికి చెందిన డీసీసీబీ డైరెక్టర్ వెలిశాల చెన్నాచారి మరికొందరు నాయకులు టీఆర్ఎస్ను వీడుతారని చెబుతున్నారు.
దీనికి తోడు.. టీఆర్ఎస్ లో పరిస్థితి అంతకంతకూ దారుణంగా మారుతోంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన ఓయూ విద్యార్థి పిడమర్తి రవి అభ్యర్థిత్వాన్నే కేసీఆర్ ఖరారు చేశారు. గత ఎన్నికల్లో పిడమర్తి రవికి… కేవలం ఆరంటే.. ఆరు వేల ఓట్లు వచ్చాయి. వైసీపీ అక్కడ రెండో స్థానంలో నిలిచింది. వైసీపీ తరపున పోటీ చేసిన మట్టా దయానంద్ విజయ్‌కుమార్ ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరారు. టిక్కెట్ తనకే వస్తుందనుకున్నారు. కానీ మళ్లీ పిడమర్తి రవికే ఇవ్వడంతో.. ఆయన అలకపాన్పు ఎక్కారు. ఇండిపెండెంట్ గా పోటీ కోసం ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ తుమ్మల, కేటీఆర్ బుజ్జగించడంతో డ్రాప్ అయ్యారు. కానీ.. పిడమర్తి రవి వర్గం… రూ.7 కోట్లు తీసుకుని సైలెంటయ్యారని సోషల్ మీడియాలో ప్రచారం చేసింది. దీంతో ఆయన ఏడుస్తూ.. ఓ వీడియో సోషల్ మీడియాలో పెట్టారు. ఇది వైరల్ అయింది. అప్పట్నుంచి ఆయన ప్రచారానికి రావడం లేదు.
ఇక ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లాలో మిగతా నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీ తరుపున ప్రచారం చేస్తున్నా నియోజకవర్గంలో మాత్రం ఇప్పటి వరకు పిడమర్తి తరపున ప్రచారం చేసిన దాఖలాలు లేవు. ఒక పక్క రెండు వర్గాలు కలిశాయనే ప్రచారం చేసుకుంటున్నా వలసలను నియంత్రించడంలో తుమ్మల నాగేశ్వరరావు ఎలాంటి ప్రయత్నం చేయడం లేదని పిడమర్తి అసంతృప్తిలో ఉన్నారు. కొంత మంది టీఆర్ఎస్ ముఖ్య నేతలు… సండ్రతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. పిడమర్తి రవి వీటిని డీల్ చేయలేకపోతున్నారు. తుమ్మల కూడా.. పూర్తిగా సత్తుపల్లి మీద దృష్టి కేంద్రకరించలేకపోతున్నారు. దీంతో.. సత్తుపల్లి సండ్ర బలంగా కనిపిస్తున్నారు.