భారతదేశ ప్రజాస్వామ్యం.. పదిలంగా ఫరిడవిల్లాలని.. రాజ్యాంగ నిర్మాతలు.. కొన్ని రాజ్యాంగ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. అందులో సీబీఐ ఒకటి. ఇది పూర్తిగా.. స్వతంత్రంగా పని చేయాల్సిన సంస్థ. రాజకీయాలకు అతీతంగా… అవినీతికి వ్యతిరేకంగా.. దేశాన్ని కాపాడాల్సిన సంస్థ. కానీ ఇప్పుడీ సంస్థ ఏం చేస్తోంది.. అధికార పార్టీకి కట్టు బానిసగా మారి..కేవలం రాజకీయ ప్రత్యర్థుల వేటకు… అస్మదీయ నేతలపై ఉన్న కేసులను నిర్వీర్యం చేయడానికి మాత్రమే ఉపయోగపడుతోంది. ఎవరు అధికారంలోకి వస్తే వారు అస్మదీయుల్ని సీబీఐ ఉన్నత స్థానాల్లో కూర్చోబెట్టడం వారు.. తమకు పదవిలిచ్చిన వారు అభిష్టాన్ని నెరవేర్చడం మాత్రమే.. తమ బాధ్యతలు అనుకోవడంతో.. ఓ ప్రధానమైన రాజ్యాంగ వ్యవస్థ నిర్వీర్యమైపోయింది.
సీబీఐ అధికారులు దొంగ పత్రాలు తయారు చేయడం ఏమిటి..?
యూపీఏ – 2 హయాంలో రంజిన్ సిన్హా అనే సీబీఐ చీఫ్ ..నేరుగా నిందితుల ఇళ్లకు వెళ్లి డీల్స్ సెట్ చేసుకుని వచ్చారన్న ఆరోపణలు ఇంకా నడుస్తూండగానే.. ఇప్పుడు… టాప్ పొజిషన్లో ఉన్న ఇద్దరూ.. ఒకరిపై ఒకరు అలాంటి ఆరోపణలే చేసుకుంటున్నారు. సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మకు, స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ అస్థ్థానా ఇద్దరూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. చివరికి వీరి ఆధిపత్య పోరాటంతో… దొంగ రిపోర్టులు కూడా తయారయ్యాయి. చివరికి సీబీఐ డీఎస్పీనే.. సీబీఐ అధికారులు అరెస్ట్ చేయాల్సి వచ్చింది. ఈ పరిణామాలు.. వాటి వెనుక ఉన్న వ్యవహారాలు చూస్తూంటే.. బ్లాక్ టిక్కెట్లు అమ్ముకునేవాడ్ని పట్టుకునే కానిస్టేబుల్లు వాటాల కోసం కొట్టుకున్నట్లుగా ఉంది. కేసులు పెట్టడానికో రేటు… వదిలేయాడనికి మరో రేటు అన్నట్లుగా వ్యవహారాలు సాగాయన్న ప్రచారం ఢిల్లీలో గుప్పు మంటోంది. వీళ్లిద్దరూ.. ప్రధానమంత్రి నరేంద్రమోడీకి సన్నిహితులే. ఇందులో నెంబర్ టూ రాకేష్ ఆస్థానాకి అయితే… మోడీ ఎంత చెబితే అంత.
బీజేపీ రాజకీయంలో సీబీఐ మిత్రపక్షంలా ఎందుకు మారింది..?
దేశంలో ఈ నాలుగేళ్లలో జరిగిన రాజకీయ పరిణామాల్లో సీబీఐ పాత్రను ఏ మాత్రం తక్కువ చేయలేము. లాలూను జైలుకు పంపి.. అక్కడి ప్రభుత్వం నుంచి ఆర్జేడీని వెళ్లగొట్టి.. తాము చేరాలని బీజేపీ అనుకున్న మరుక్షణం మొదటగా యాక్షన్ ప్రారంభించింది సీబీఐనే. లాలూను మరోసారి జైలుకు పంపి.. ఆయన కుమారులపై.. మళ్లీ మళ్లీ ఆరోపణలు చేసి లక్ష్య సాధనలో సాయం చేసింది. ఇక… ప్రాంతీయ పార్టీల అధినేతల్ని గుప్పిట్లో పెట్టుకోవడానికి .. ఈ సీబీఐ ఓ ప్రధాన అస్త్రం. కేసీఆర్ పై రెండు సీబీఐ కేసులున్నాయని… ఒక సారి.. హైదరాబాద్ వచ్చి ప్రశ్నించి పోయారు. కేంద్రానికి ఎదురుగా వెళ్తే రెండో సారి కూడా వచ్చి ఉండేవారు. కానీ కేసీఆర్ రిస్క్ తీసుకోలేదు. ఇక తమిళనాడు. ఒడిషాల్లో ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఇక ఏపీలో ఇప్పటికే ఐటీ, ఈడీల రౌండ్ పూర్తయింది. త్వరలో సీబీఐ సిరీయల్ ఉందన్న ప్రచారం సాగుతోంది.
మోడీ అధికారుల మధ్య రాజీ చేస్తే అది సుఖాంతమా..? పతనమా..?
సీబీఐ టాప్ టూ అధికారులిద్దరూ రోడ్డున పడటంతో.. సెటిల్మెంట్ చేయడానికి ప్రధాని సిద్ధమయ్యారు. ఇద్దర్నీ తనను కలవాలని ఆదేశించారు. ఇద్దరికీ సుద్దులు చెప్పి పంపుతారమో…? ఇద్దరూ రాజీ పడతారేమో..? కానీ అది సుఖాంతమా..? రాజ్యాంగ వ్యవస్థకు అంతిమ పతనమా..? . ఎవరి ఒత్తిళ్లకూ తలొగ్గకుండా దేశం కోసం.. దేశ ప్రజల కు భరోసా ఇచ్చేలా పని చేయాల్సిన సంస్థ రాజకీయ కూటమిలో సభ్యునిగా మారి.. ప్రధాని దగ్గర పంచాయీతీలు పెట్టుకోవడం సుఖాంతమా..?రాజ్యాంగ వ్యవస్థకు అంతిమ పతనమా..? .