కాంగ్రెస్ పార్టీలో రాజ్యసభ సభ్యుడు వి.హనుమంత రావు తీరే వేరని అందరికీ తెలిసిన విషయమే. ప్రజల దృష్టిని ఆకర్షించడం ఎలాగో ఆయనకి తెలిసినంత బాగా బహుశః ఆ పార్టీలో మరెవరికీ తెలియదేమో? ట్యాంక్ బండ్ మీద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన నిన్న హటాత్తుగా మౌన దీక్షకు కూర్చొన్నారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ విద్యార్ధి రోహిత్ మృతికి కారకులయిన వారినందరిపై తక్షణమే చర్యలు చెప్పట్టాలని, రోహిత్ కి, అలాగే సస్పెండ్ అయిన విద్యార్ధులు అందరికీ కూడా న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన నిన్న ఒక్కరోజు మౌన దీక్ష చేపట్టారు.
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వైస్ ఛాన్సిలర్ అప్పారావుపై ప్రభుత్వం ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోలేదు కానీ ఆయన దీర్ఘకాల శలవుపై వెళ్ళిపోయారు. అలాగే రోహిత్ మరణం తరువాత మిగిలిన నలుగురు విద్యార్ధులపై సస్పెన్షన్ ఎత్తివేశారు. కానీ వాటర్ధం రోహిత్ కి, అతని కుటుంబానికి, సస్పెండ్ చేయబడిన నలుగురు విద్యార్ధులకు న్యాయం జరిగిందని కాదు. ప్రభుత్వం ఇంకా బాధ్యులపై చర్యలు తీసుకోవలసి ఉంది. అలాగే మళ్ళీ ఇటువంటి పరిస్థితులు, సంఘటనలు పునరావృతం కాకుండా యూనివర్సిటీ యాజమాన్యం తగిన చర్యలు చేపట్టవలసి ఉంది. అవి ఎప్పటికయినా జరుగుతాయో లేదో ఎవరికీ తెలియదు. కనుక ఈ సంఘటనను వి.హనుమంత రావు వంటి రాజకీయ నేతలు ఉపయోగించుకొంటూనే ఉంటారు.
ఫిబ్రవరి రెండున జి.హెచ్.ఎం.సి.ఎన్నికలు జరుగబోతున్నాయి కనుక ప్రజల దృష్టిని ఆకర్షించడానికి వి.హనుమంత రావు చేసిన మౌన దీక్ష ఉపయోగపడుతుందేమో గానీ అసలు సమస్య పరిష్కారానికి ఏమాత్రం ఉపయోగపడదని చెప్పవచ్చును. ఇప్పటికే రాజకీయ పార్టీలన్నీ ఆ సంఘటనను పక్కన పెట్టి ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయిపోవడం గమనించవచ్చును. కనుక రాజకీయ నాయకులందరూ బహుశః జి.హెచ్.ఎం.సి. ఎన్నికలు పూర్తి కాగానే ఇక ఈ సమస్యని పక్కనపడేసి మరో తాజా సమస్యకి షిఫ్ట్ అయిపోయినా ఆశ్చర్యమేమీ లేదు.