తెలంగాణలో అసెంబ్లీ ఎందుకు రద్దు చేశారూ అంటే… తెరాస సర్కారు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కేసులు పెడుతోంది కాబట్టి..! ఇదే కారణాన్ని ప్రతీ ప్రచార సభలోనూ చెప్పుకుంటూ వస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్. మంగళవారం ఘన్ పూర్ లో జరిగిన సభలో కూడా మంత్రి కేటీఆర్ ఇదే అంశం మీద మాట్లాడారు. తెలంగాణలో ప్రాజెక్టులు పూర్తయితే కేసీఆర్ కి మళ్లీ అధికారం వచ్చేస్తుందన్న భయంతోనే ఇలా కేసులు పెట్టి మోకాలడ్డే ప్రయత్నం చేశారని ఆరోపించారు.
తెలంగాణకు గడచిన అరవయ్యేళ్లుగా కాంగ్రెస్, టీడీపీలు నీళ్లు ఇవ్వకుండా సతాయించాయన్నారు కేటీఆర్. ఇవాళ్ల ఆ రెండు పార్టీలూ ఒకటై ప్రాజెక్టులకు అడ్డం పడే పరిస్థితి వచ్చిందన్నారు. అందుకే ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకున్నారనీ, ఎన్నిసార్లు కోర్టులకు పోయి వీళ్లతో కొట్లాడతామనీ ఇలా కాదనుకున్నారు అన్నారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశమనీ, అలాంటి ప్రజాస్వామ్యంలో ప్రజా కోర్టుకు మించిన కోర్టు లేదన్నారు కేటీఆర్. ‘అందుకే.. ఈరోజు మేం చెప్పేది నిజమైతే మమ్మల్ని గెలిపించమనీ, కచ్చితంగా వారి డిపాజిట్లు గల్లంతయ్యే విధంగా తీర్పు ఇవ్వాలని మీ ముందుకు రావడం జరిగింది’ అన్నారు కేటీఆర్. ఇది మనం కావాలని తెచ్చిన ఎన్నికలనీ, ప్రజాతీర్పు కోరుతూ మనం పెట్టిన ఎన్నికలనీ, కాంగ్రెస్ చేస్తున్న దగుల్బాజీ రాజకీయాలను ప్రజా కోర్టులోనే ఎండగట్టాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ పార్టీ కోర్టులో కేసులు పెడితే, అసెంబ్లీ రద్దు ఎందుకు చేశారనే దానికి ఇప్పటికీ తెరాస దగ్గర సరైన వివరణ లేదు. అది చాలదన్నట్టు… ప్రజా కోర్టుకు మించింది లేదు, ఇక్కడి ప్రజలు ఇచ్చే తీర్పే అంతిమం అని కేటీఆర్ అనడమూ లాజిక్ కి దూరంగానే ఉంది. ఈ వ్యాఖ్య ఎన్నికల ఫలితాల వరకూ ఆపాదించుకోవచ్చు, తప్పులేదు. కానీ, కోర్టులో ఉన్న కేసులపై కోర్టు ఇచ్చిన తీర్పునూ… ఎన్నికల ద్వారా తెరాసకు అధికారం కట్టబెడుతూ ఇచ్చిన తీర్పునూ ఒకేలా చూడాలన్నట్టు కేసీఆర్ వ్యాఖ్యల సారాంశం ఉంది. అదెలా సాధ్యమనేదే ప్రశ్న..? కోర్టు, కేసులు, తీర్పు.. అనేది ఎన్నికలతో ఏమాత్రం సంబంధం లేని అంశం. ప్రభుత్వాలు మారుతున్నా కోర్టు పని కోర్టుదే. అంటే, మరోసారి తెరాస గెలిచినంత మాత్రాన దాన్ని కాంగ్రెస్ పెట్టిన కేసులపై తీర్పుగా పరిగణనలోకి తీసుకోవాలా..? ఏమో, కేటీఆర్ వాదన ఇలానే వినిపిస్తోంది. తెరాస సర్కారుపై కాంగ్రెస్ కేసులు వేసింది కాబట్టి… ప్రజలు ఎన్నికల్లో తీర్పు ఇవ్వాలంటే… ఈ పిలుపులో లాజిక్ ఎక్కడుంది..?