తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో.. యువతను ఉత్సాహపరచడంలో… రసమయి బాలకిషన్ ది ప్రత్యేకపాత్ర. అందుకే కేసీఆర్ ఆయనకు గత ఎన్నికల్లో… మానకొండూరు అసెంబ్లీ టిక్కెట్ ఇచ్చి ప్రొత్సహించారు. మొదటిసారి గెలిచారు. రెండో సారి ఎన్నిక కోసం ప్రజల దగ్గరకు వెళ్తున్నారు. కానీ ఆయన పాటలు ఎక్కడా వినిపించడం లేదు. ప్రజల అసమ్మతి రాగానే ఆయనకు ఎదురొస్తున్నాయి. ప్రచారంలో రసమయి తీవ్ర నిరసనలకు గురువుతున్నారు. కాలుకు గజ్జెగట్టి ఆటపాటలతో ఉద్యమ సమయంలో జనాన్ని ఉర్రూతలూగించిన రసమయికి ఎన్నికల సమయంలో అదే జనం నుంచి నిరసన జ్వాలలు ఎదురుకావడంతో గులాబీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మానకొండూర్ నియోజకవర్గం నుంచి 2014లో తొలిసారి కాంగ్రెస్ అభ్యర్థి ఆరేపల్లి మోహన్‌పై 46 వేల పై చిలుకు ఓట్ల మెజార్టీతో రసమయి విజయం సాధించారు. స్వరాష్ట్రంలో తొలి తెలంగాణ సాంస్కృతిక సారధిగా నియమితులైయ్యారు. ఉద్యమ నాయకుడు కావడంతో గత ఎన్నికల్లో సునాయాసంగా విజయం సాధించిన రసమయి.. ఈసారి గెలవడం అంత సులువైన విషయం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తనను విమర్శించిన ఎంతటివారిపైనైనా నోరుపారేసుకుంటూ కొత్త వివాదాలు తెచ్చుకుంటున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరుఫున బరిలో నిలిచిన ఆరేపల్లి మోహన్ మళ్లీ టిక్కెట్ తనకే తక్కుందని ధీమాతో ఉన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు. ప్రత్యర్థి ఆరేపల్లి మోహన్ స్థానికుడు. రసమయి స్థానికేతరుడు. ఈ సెంటిమెంట్ కూడా.. మోహన్ ప్రయోగిస్తున్నారు.
కళాకారుడిగా జనం మెప్పుపొందిన రసమయి, ప్రజాప్రతినిధిగా జనం అభిమానాన్ని మాత్రం చురగొనలేకపొతున్నారు. ప్రచారంలో ఎక్కడికి వెళ్లినా “గోబ్యాక్ రసమయి” అనే ప్లకార్డులే దర్శనమిస్తున్నాయి. బతుకమ్మ సంబరాల్లో భాగంగా ఇల్లంతుకుంట మండలంలో పర్యటించిన అతనికి గ్రామస్తుల నుంచి ఊహించని వ్యతిరేకత ఎదురైంది. సొంత పార్టీకి చెందిన మహిళలే త్రాగునీటి కోసం ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. సాధారణంగా ఇలాంటి పరిస్థితి వ్యతిరేక పార్టీకి చెందిన వారి నుంచి ఎదుర్కొవాల్సి ఉంటుంది. కానీ రసమయి మాత్రం సొంత పార్టీ కార్యకర్యల నుంచి తీవ్ర నిరసనలు చవిచూడాల్సి వస్తోంది. దళితులకు మూడెకరాల భూమి విషయంలో కొద్ది రోజుల కిందట.. బెజ్జంకి మండలం గూడెం గ్రామానికి చెందిన ఇద్దరు దళితులు పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఇలాంటి ఘటనలతో.. రసమయి.. రేసు నుంచి దూరంగా పోతున్నట్లుగా నియోజకవర్గంలో పరిస్థితి మారింది.