బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కొద్ది రోజుల క్రితమే.. కరీంనగర్లో బహిరంగసభ నిర్వహించి.. బీజేపీ గెలవబోతోందన్నంత కాన్ఫిడెన్స్ చూపించారు. అయితే.. ఈ లోపే… అదే కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు పార్టీకి గుడ్ బై చెప్పేశారు. కారణం.. తనకు హుస్నాబాద్ టిక్కెట్ వేరొకరికి ఇవ్వడంతో.. జిల్లా బీజేపీ అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి, అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్‌కు పంపారు. హుస్నాబాద్ నుంచి పోటీ చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నా… తనను అవమానించడంతో.. రాజీనామా చేస్తున్నట్లు కొత్త శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. పార్టీనే నమ్ముకున్న తనకు బీజేపీ పెద్దలు తీవ్ర అన్యాయం చేశారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
పాత కరీంనగర్ జిల్లా భారతీయ జనతా పార్టీలో తొలి నుంచి కొంతకాలం రెడ్డి, వెలమ వర్గాలుగా, మరికొంతకాలం నాలుగు స్తంభాలాటగా గ్రూపులుగా విడిపోయి రాజకీయాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు గత జిల్లా కార్యవర్గం ఎన్నిక సమయంలో రెండు గ్రూపుల నేతలు కలిసిపోయి ఇద్దరికి ఆమోదయోగ్యంగా అధ్యక్షుడిని ఎంపిక చేసినా మరో వర్గానికి ఆ నిర్ణయం ఏమాత్రం నచ్చలేదు. కొంతకాలం సజావుగానే రాజకీయాలు నడిచినా జిల్లా కార్యవర్గం కూర్పు విషయంలో ఏర్పడిన విబేధాలు మళ్లీ కథను మొదటికి తీసుకువచ్చాయి. దీంతో పార్టీ మళ్లీ మూడు వర్గాలుగా విడిపోగా ఏ వర్గానికి చెందని నేతలు పార్టీ గ్రూపుగా నాల్గవ స్తంభంగా మిగిలారు. ఆ తర్వాత జిల్లాల విభజన జరిగి ఏ జిల్లాకు ఆ జిల్లాకు కమిటీలు ఏర్పడ్డాయి. ఈ సందర్భంలో కూడా అధ్యక్షుల నియామకం విషయంలో గ్రూపులు స్పష్టంగా ఎవరి ఆధిపత్యం వారు చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడా ఆధిపత్య పోరు టిక్కెట్ల దగ్గరకు వచ్చేసరికి పెరిగిపోయింది. జిల్లా అధ్యక్షుడి రాజీనామాకు దారి తీసింది.
హుస్నాబాద్ లో అంతో ఇంతో పట్టు ఉన్న కొత్త శ్రీనివాసరెడ్డిని పార్టీలో చేర్చుకునేందుకు టీఆర్ఎస్ ముఖ్య నేతలు కొంత కాలంగా చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికిప్పుడు వెంటనే ఏమి చేయలేకపోయినా సముచిత స్థానాన్ని కల్పిస్తామని ఆ నేతకు టీఆర్ఎస్ ముఖ్య నేతలు హామీ ఇచ్చారని తెలిసింది. దీంతో ఆయన టీఆర్ఎస్ లో చేరే అవకాశం ఉంది. మరికొన్ని చోట్ల చోటా నేతలు.. టిక్కెట్ల కోసం ఆశపడిన వారు.. టీఆర్ఎస్, కాంగ్రెస్‌లలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.