వచ్చే ఎన్నికల్లో టీడీపీ పరిస్థితి ఎలా ఉంటుందనే అంశంపై ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తరచూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నారు. రెండ్రోజుల కిందట ఆయన సిట్టింగులపై ఓ కామెంట్ చేశారు! టీడీపికి రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితి బాగుందని చెబుతూనే, కనీసం 30 నుంచి 40 మందిని మార్చాల్సిన అవసరం ఉందనీ, ఆయా స్థానాల్లో కొత్తవారికి అవకాశం ఇస్తే టీడీపీకి తిరుగు ఉండదని అభిప్రాయపడ్డ సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడీ వ్యాఖ్యలే టీడీపీ వర్గాల్లో చర్చకు కారణమౌతున్నాయి. సిట్టింగులను మార్చాలా వద్దా, ఎంతమందిని మార్చాలి అనేది ఇలా బహిరంగంగా చర్చించుకునే అంశం కాదనీ, అయినా ఈ అంశం జేసీ మాట్లాడాల్సిన విషయం అస్సలు కాదనే అభిప్రాయం కొంతమంది నేతల్లో వ్యక్తమౌతోంది. కొంతమంది ఎమ్మెల్యేల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కూడా కొంత అసంతృప్తి ఉందనే చర్చ ఎప్పట్నుంచో ఉన్నదే. అయితే, మార్పులూ చేర్పులూ ఏవైనా ఉంటే అది పార్టీ అధిష్ఠానం తీసుకునే నిర్ణయమే అవుతుందిగానీ… దాని మీద ఇలా బహిరంగంగా జేసీ వ్యాఖ్యానించడం సరికాదనే ఫిర్యాదులు ఇప్పటికే పార్టీ అధిష్టానానికి కొంతమంది నేతలు చేశారట!
సిట్టింగుల మార్పులపై జేసీ వ్యాఖ్యానాల వెనక ఆయన సొంత ప్రయోజనాలు కూడా ఉన్నాయనే అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. అనంతపురం పార్లమెంటు పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజక వర్గాల్లో తన అనుయాయులైన కొంతమందికి టిక్కెట్లు ఇప్పించుకునే వ్యూహంలో జేసీ ఉన్నారని సమాచారం! అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి స్థానంలో గుర్నాథరెడ్డికి టిక్కెట్ ఇప్పించేందుకు జేసీ చక్రం తిప్పుతున్నట్టు తెలుస్తోంది. గుంతకల్ సిట్టింగ్ ఎమ్మెల్యేని కూడా మార్చేసి… మధుసూదన్ గుప్తాకి, శింగనమల నియోజక వర్గంలో కూడా సిట్టింగ్ కి కాకుండా తన అనుచరుల్లో ఒక ప్రముఖుడికి టిక్కెట్ తెచ్చిపెట్టే ప్రయత్నంలో ఉన్నారట..!
తనవారికి టిక్కెట్లు ఇప్పించుకునే క్రమంలో… ఇలా రాష్ట్రవ్యాప్తంగా కొంతమంది సిట్టింగులను మార్చాలనే వాదనను జేసీ తెరమీదికి తీసుకొస్తున్నట్టు కొంతమంది విశ్లేషిస్తున్నారు..! తనకు ఇష్టం లేనివారికి వచ్చే ఎన్నికల్లో సీట్లు దక్కకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఇలా వ్యవహరిస్తున్నారంటూ… జేసీ వ్యతిరేకిస్తున్న నేతలు ఇప్పటికే అధినేత చంద్రబాబు నాయుడుకి ఫిర్యాదు చేసినట్టు కూడా తెలుస్తోంది. పార్టీ అధినాయకత్వం తీసుకోవాల్సిన నిర్ణయాలు, వెల్లడించాల్సిన అభిప్రాయాలపై జేసీని మాట్లాడకుండా కట్టడి చేయాల్సిన అవసరం ఉందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం.