సవ్యసాచి ఎందుకు చూడాలి? అనే ప్రశ్నకు పది సమాధానాలు దొరికితే… వాటిలో కనీసం నాలుగైనా `మాధవన్` తో ముడిపడి ఉంటాయి. తెలుగు సినిమాలో మాధవన్ నటించడం, అందునా ప్రతినాయకుడి పాత్ర కావడంతో సాధారణంగానే `సవ్యసాచి`పై లుక్కు పడింది. పైగా డిఫరెంట్ కాన్సెప్ట్ ఆయె. `ధృవ` తరవాత స్టైలీష్ విలన్లకు గిరాకీ పెరిగింది. ఆ నేపథ్యంలో `సవ్యసాచి`పై ఫోకస్ పడింది. టీజర్లో మాధవన్ ని కనిపించకుండా చేసిన చిత్రబృందం.. ట్రైలర్లో మాత్రం దాచే సాహసం చేయలేదు. ఈ సినిమాకి మాధవన్ ఎంత ప్లస్సో.. ట్రైలర్ చూస్తే అర్థమైపోతోంది. హీరో – విలన్ల మధ్య పోటీ ఎంత బాగుంటే… సినిమా అంత బాగుంటుంది. ఈ సూత్రం నమ్మి చేసిన సినిమా `సవ్యసాచి`. ట్రైలర్ చూస్తుంటే.. మాధవన్ చెలరేగిపోయాడనే అనుకోవాలి. సాధారణంగా ట్రైలర్ హీరో షాట్ తోనే, డైలాగ్‌తోనే ఆగుతుంది. కానీ `సవ్యసాచి` చూస్తే… మాధవన్ ని లాస్ట్ షాట్లోకి తీసుకొచ్చారు. దాన్ని బట్టి చూస్తే… మాధవన్‌పై చిత్రబృందం ఎంత నమ్మకం పెట్టుకుందో అర్థమవుతోంది. చైతూ – మధ్యవన్ మధ్య నడిచే దృశ్యాలు, వాళ్ల మధ్య వచ్చే ఛాలెంజింగ్ ఎపిసోడ్లే ఈ కథకు కీలకం. ట్రైలర్ ఆసాంతం చూస్తే… మాధవన్ డామినేషన్ అడుగడుగునా కనిపిస్తోంది. మరి రేపు తెరపై.. చైతూ – మాధవన్ పాత్రల్ని ఎలా బాలెన్స్ చేస్తారో చూడాలి.