చిరంజీవి మెగా స్టార్ గా ఎదిగిన తర్వాత ప్రజారాజ్యం అనే రాజకీయ పార్టీని స్థాపించి, అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేక, ఆ తర్వాత పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేసాడు. ప్రజారాజ్యం వైఫల్యం కంటే కూడా, కాంగ్రెస్ పార్టీలో విలీనమే అభిమానుల్ని ఎక్కువ బాధించింది. అయితే అదంతా గతం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్తున్నాడు. అయితే చిరంజీవి ప్రజారాజ్యం తో పోలిస్తే, పవన్ కళ్యాణ్ కి కొన్ని రకాలుగా ‘సుడి ‘ కలిసి వస్తోందా అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
నిజానికి చిరంజీవి విలన్ పాత్రలు, సైడ్ హీరో పాత్రలు, 30 సెకన్ల పాత్రలు ( తాయారమ్మ బంగారయ్య) , ఇలా రకరకాల పాత్రలు చేస్తూ, డాన్సు నేర్చుకుని, ఫైట్లు నేర్చుకుని ఒక పదేళ్లపాటు నిర్విరామంగా శ్రమిస్తే, టాప్ స్లాట్ లోకి వచ్చాడు. ఆ తర్వాత మరో పదేళ్లపాటు వరుస హిట్లతో తన స్థానాన్ని నిలబెట్టుకుని మెగాస్టార్ అయ్యాడు. కానీ పవన్ కళ్యాణ్ కి నాలుగవ సినిమాతోనే స్టార్ డమ్ వచ్చేసింది. ఒకానొక సమయంలో ( ఖుషి ) చిరంజీవి కంటే పవన్ కళ్యాణ్ కి ఎక్కువ స్టార్డం ఉందా అంటూ కొన్ని పత్రికల్లో కథనాలు కూడా వచ్చాయి. చిరంజీవి తమ్ముడు కావడమే కాకుండా పవన్ కళ్యాణ్ కి అనేక విషయాలు కలిసి వచ్చాయనే చెప్పాలి. ఎందుకంటే వారసులుగా వచ్చిన ఇతరులెవ్వరూ పవన్ కళ్యాణ్ స్థాయి స్టార్ డమ్ సంపాదించుకోలేకపోయారు. కష్టపడడం తో పాటు కొన్ని సార్లు లక్ కూడా కలిసి రావాలి.
ఇప్పుడు రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ కి ఇలాగే కలిసి వస్తోందా అని జనసేన అభిమానులు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. ఇటీవలే పంచాయతీ ఎలక్షన్ లను నిర్వహించాల్సిందేనని హైకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆర్డర్ వేసింది. చిరంజీవి ప్రజారాజ్యం సమయంలో గ్రామస్థాయిలో , బూత్ స్థాయిలో పార్టీ బలపడకపోవడానికి ఒక కారణం స్థానిక సంస్థల ఎన్నికలు లేకపోవడమే. ఫలితాల సంగతి అటుంచి, పంచాయతీ ఎన్నికల్లో పాల్గొన్న ప్రతి పార్టీ క్షేత్రస్థాయిలో ఎంతో కొంత బలపడుతుంది అనేది వాస్తవం. ప్రతి గ్రామంలోనూ పార్టీ జెండా ఎగరడం, కొంత మంది గ్రామ స్థాయి నాయకులు పార్టీ లో చేరడం అనేది స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేటప్పుడు సర్వ సాధారణం. 2014 ఎన్నికలకు ముందు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు వైఎస్ఆర్సిపి పార్టీ క్షేత్రస్థాయిలో బలపడడానికి, ఆ పార్టీ జెండా గ్రామాల్లో ఎగరడానికి సహాయం చేసిన మాట తెలిసిందే. ఈ లెక్కన జనసేన పార్టీ కూడా ఫలితాల నిమిత్తం లేకుండా పంచాయతీ ఎన్నికల సమయంలో కాస్త బలపడడం అనేది అనివార్యం. అది పార్టీకి ప్రధాన ఎన్నికలలో ఉపయోగపడేదే. ఆ రకంగా చూస్తే హైకోర్టు తీర్పు పవన్ కళ్యాణ్ కి కలిసి వచ్చేదే.
ఇక పవన్ కళ్యాణ్ కి కలిసి వస్తున్న మరొక అంశం ప్రజారాజ్యం వైఫల్యం. అప్పుడు ప్రజారాజ్యం వైఫల్యం కావడం వల్ల, మంచి అవకాశాన్ని మిస్ చేసుకున్నామన్న భావన కాపుల లో ఉంది. ఈసారి మళ్లీ అవకాశాన్ని మిస్ చేసుకుంటే భవిష్యత్తులో ఇలాంటి అవకాశం రాకపోవచ్చు అన్న భావన వారిలో కనిపిస్తోంది. ఆ రకంగా చూసుకున్నా కూడా, చిరంజీవి ప్రజారాజ్యం తో వేసిన పునాది ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి ఉపయోగ పడుతోంది.
ఇక చిరంజీవి వైఫల్యానికి మరొక కారణం మీడియా మద్దతు లేకపోవడం అని ఆయన అభిమానులు చెబుతూ ఉంటారు. అదృష్టవశాత్తు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మీడియా తో సమానంగా సోషల్ మీడియా అభివృద్ధి చెందడం, మీడియా లో చూపించని అనేక అంశాలు సోషల్ మీడియా కారణంగా ప్రజల్లోకి వెళ్లడం చూస్తుంటే, సోషల్ మీడియా ఎంత గా ప్రజల జీవితాల్లో భాగమైపోయిందో తెలుస్తోంది. టీఆర్పీ రేటింగులలో, అత్యంత తక్కువ రేటింగ్ కలిగిన 99టీవీ లో తప్ప ఏ ఛానల్ లో కూడా జనసేన కవాతు గురించి ప్రచారం చేయకపోయినా, కవాతు కి అని లక్షల మంది హాజరవడం కూడా సోషల్ మీడియా పుణ్యమే.
ఇలా పంచాయతీ ఎన్నికలు ప్రధాన ఎన్నికలకు ముందే జరగడం, 2009 తో పోలిస్తే ఇప్పుడు కాపుల లో ఐక్యత పెరగడం, ప్రజారాజ్యంతో పోలిస్తే జనసేనకు ఎంతోకొంత మీడియా మద్దతు ఉండడం ( 99 టీవీ, ఆంధ్రప్రభ) , మీడియా తో సమానంగా సోషల్ మీడియా వ్యాప్తి చెందడం – ఇవన్నీ చూస్తుంటే చిరంజీవి తో పోలిస్తే పవన్ కళ్యాణ్ కు ఎంతో కొంత అదృష్టం బాగున్నట్టే కనిపిస్తోంది. మరి దీనిని పవన్ కళ్యాణ్ ఎంతవరకు ఉపయోగించుకుంటాడో, వేచి చూడాలి