అగ్రిగోల్డ్ విషయంలో బీజేపీపై అగ్రెసివ్ గా వెళ్లాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించుకుంది. వరుసగా ధర్నాలు చేస్తూ.. అగ్రిగోల్డ్ ఆస్తులను టీడీపీ నేతలు స్వాహా చేస్తున్నారన్నట్లుగా ఆరోపణలు చేస్తూండటాన్ని ఏ మాత్రం.. సహించకూడదని.. నిర్ణయించింది. నేరుగా ఆరోపణలు చేసిన వారందరిపై కోర్టు ధిక్కార పిటిషన్లు వేయబోతున్నారు. ఇది పార్టీ పరంగా కాకుండా.. కేసు దర్యాప్తు చేస్తున్న సీఐజీ ద్వారానే వేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అగ్రిగోల్డ్ వ్యవహారంలో తప్పుడు ఆరోపణలు చేస్తున్న .. బీజేపీ నేతలపై కోర్టు ధిక్కార పిటిషన్ వేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది.
హైకోర్టు పర్యవేక్షణలో అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం జరుగుతుండగా .. ఆరోపణలు చేయడంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రులతో సీఎం చంద్రబాబు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. కోర్టు పర్యవేక్షణలోనే పూర్తిస్థాయిలో అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం వేస్తున్నారని.. కోర్టుకు దురుద్దేశాలు ఆపాదించే విధంగా .. బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయాన్ని మంత్రులు వ్యక్తం చేశారు. దర్యాప్తు చేస్తున్న సీఐడీతోనే కోర్టు ధిక్కార పిటిషన్ వేయించనున్నారు. అగ్రిగోల్డ్ కు సంబంధించి ప్రతి వ్యవహారం కోర్టు ద్వారానే నడుస్తోంది. గతంలో జీఎస్సెల్ సంస్థ టేకోవర్ కు ముందుకొచ్చినా.. అది కూడా కోర్టు పరిశీలన ద్వారా ప్రక్రియ జరిగింది. అయితే చివరికి జీఎస్సెస్ సంస్థ చేతులెత్తేసింది. దీంతో.. ఇప్పుడు సీఐడీ ద్వారా వేలానికి రంగం సిద్ధమయింది. ఇదంతా కోర్టు పర్యవేక్షణలో జరుగుతుంది. ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు.
అయినప్పటికీ.. బీజేపీ నేతలు ఇప్పుడు దీన్నో రాజకీయ అంశంగా చేసుకుని.. ఆరోపణలు చేయడానికి సిద్ధమైపోవడంతో… ఎదురుదాడి చేయాలని టీడీపీ నిర్ణయించింది. నేరుగా కోర్టు ధిక్కరణ పిటిషన్లే వేయబోతూండటం కాస్త సంచలనం కలిగించేదే. కోర్టు ఈ రాజకీయ ఆరోపణల్ని సీరియస్ గా తీసుకంటే బీజేపీ నేతలకు చిక్కులు తప్పకపోవచ్చు.