ప్రస్తుతం ఉన్న మాధ్యమాలలో, తెలుగు భాష పై కాస్త ప్రత్యేకమైన మక్కువ చూపిస్తూ, ఇంగ్లీషు పదాలను వీలైనంతవరకు తెలుగులో తర్జుమా చేస్తూ వార్తలు అందించడంలో ఈనాడు ముందు వరుసలో ఉంటుంది. అయితే ఒక్కొక్క సారి, ఇది కొంచెం ‘అతి ‘ లాగా కూడా అనిపిస్తోంది.
వివరాల్లోకి వెళితే, మీ టు ఉద్యమం గురించి వార్త అందించిన ఈనాడు పత్రికలో, ఫేస్ బుక్ ని “ముఖ పుస్తకం” అంటూ ప్రస్తావించడం పాఠకులలో కాస్త గందరగోళానికి దారితీసింది. కన్నడ సినిమాలో నటిస్తున్న నటి కైరా తన ఫేస్ బుక్ లో, దర్శకుడిపై ఆరోపణలు చేస్తూ ఒక పోస్టు రాసింది. ఆ వార్తను పాఠకులకు అందించే క్రమంలో ముఖపుస్తకం (ఫేస్ బుక్) అంటూ కొత్త పదాన్ని పాఠకులకు పరిచయం చేసింది ఈనాడు.
ఈనాడు ప్రయత్నం అభినందించదగ్గదే అయినప్పటికీ, కొన్ని పదాలను తర్జుమా చేయడం సబబు కాదు. మొబైల్ ని చరవాణి అంటూ, ఇంటర్నెట్ అంతర్జాలం అంటూ ప్రస్తావించినా అది సబబే ఎందుకంటే అవి ఏ ఒక్క ప్రోడక్ట్ కి సంబంధించని ‘జెనెరిక్’ పదాలు. ఫేస్ బుక్, ట్విట్టర్, యాపిల్, ఇలాంటివి ఆయా ప్రోడక్ట్ ల పేర్లు. ఇలాంటి ప్రోడక్ట్ ల పేర్లు ప్రస్తావించేటప్పుడు తర్జుమా చేయడం కంటే వాటి అసలైన పేర్లను వాడడమే సమంజసం.
ఏది ఏమైనా తెలుగు భాషపై అభిమానం చూపించడం, ఆ భాషను మరింతగా సుసంపన్నం చేయడం అనే విషయంలో ఈనాడు ప్రయత్నం అభినందించదగ్గదే అయినా, కొన్నిసార్లు తమ తాపత్రయాన్ని నియంత్రించుకోవాల్సిన అవసరం కూడా ఈనాడు కి ఉంది.
– జురాన్ (@CriticZuran)