ఎన్టీఆర్ బయోపిక్‌లో రానా ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు నాయుడు పాత్రలో రానా కనిపిస్తాడనగానే ఈ సినిమాకి తొలిసారి మల్టీస్టారర్ లుక్ వచ్చింది. ఎన్టీఆర్ బయోపిక్‌లో అడుగుపెట్టిన తొలిస్టార్ కూడా రానానే. అయితే రానా పాత్ర గురించి ఓ ఆసక్తికరమైన విషయం బయటపడింది. ఈ సినిమాలో రానా పాత్ర కేవలం ఒక్క సన్నివేశానికే పరిమితం అని తెలిసింది. అయితే ఆ ఒక్క సీన్ చాలా కీలకమట. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు దేశం జెండాతో గెలిచిన ఎమ్మెల్యేల్ని ఢిల్లీ తీసుకెళ్లి బలనిరూపణ చేయడంలో అప్పట్లో నారా చంద్రబాబు నాయుడు పాత్ర కీలకం. ఎం.ఎల్.ఏలను రహస్యంగా రైలులో ఢిల్లీ తరలించారు. వారితో పాటు చంద్రబాబు నాయుడు కూడా ఉన్నాడు. మధ్యలో దారిలో కాంగ్రెస్ కార్యకర్తలు కొంతమంది దాడి చేయడానికి ప్రయత్నిస్తే.. అందులోంచి కూడా క్షేమంగా బయటపడ్డారు.ఈ టోటల్ ఎపిసోడ్ ఓ యాక్షన్ ఘట్టాన్ని తలపిస్తుంది. ఈ సీన్ లోనే రానా కనిపిస్తాడు. రానాతో మరో రెండు సన్నివేశాల్ని తెరకెక్కించినప్పటికీ.. వాటిని ప్రస్తుతానికి పక్కన పెట్టేశారని తెలుస్తోంది. ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు, మహా నాయకుడు అనే రెండు భాగాలుగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కథానాయకుడుకి సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తయింది. మహానాయకుడు పార్ట్ కూడా దాదాపు సగానికి పైగా పూర్తి చేసుకుంది. మహా నాయకుడు పార్ట్ లోనే రానా కనిపిస్తాడు.