వైకాపా ఎమ్మెల్యే రోజా ప్రెస్ మీట్ పెట్టారు..! టాపిక్… ఆంధ్రాలో మహిళలపై జరుగుతున్న దాడులపై స్పందించడానికీ, జగన్ కు అశేష ప్రజాదరణ లభిస్తోందని చెప్పడానికీ! మహిళల మీద దాడులు చేస్తున్నవారికి టీడీపీ ప్రోత్సహిస్తోందనీ, అలాంటి వ్యక్తుల్ని క్యాబినెట్ లో మంత్రులుగా పెట్టుకున్నారని రోజా ఆరోపించారు. మహిళలకు గౌరవించని నేతలు పార్టీలో ఉన్నారనీ, అలాంటి పార్టీకి ఆడపడుచులు ఎందుకు ఓట్లెయ్యాలి అన్నారు రోజా. మహిళా నాయకురాలిగా, మహిళల సమస్యలపై మాట్లాడేందుకు బయల్దేరిన తనను… ఒక మహిళా ఎమ్మెల్యే అని కూడా చూడకుండా ఏడాదిపాటు సస్పెండ్ చేశారన్నారు రోజా. తనకున్న పోలీసు బలగంతో హైదరాబాద్ లో తనను ఎలా తిప్పితిప్పి వదిలారో రాష్ట్ర ప్రజలందరూ చూశారన్నారు రోజా..! ఇలాంటివారిని ఆంధ్రప్రదేశ్ నుంచి తరమికొట్టాలనీ అప్పుడే మంచి రోజులు వస్తాయన్నారు. చంద్రబాబుకి ఓట్లెయ్యాల్సిన అవసరం లేదని మహిళలను కోరుతున్నా అన్నారు రోజా.
జగన్ మీద కేసులు పెట్టించడానికే ఆరోజున కాంగ్రెస్ తో చంద్రబాబు నాయుడు జతకట్టారన్నారు. ఢిల్లీకి చంద్రబాబు నాయుడు ఎప్పుడు వచ్చినా జగన్ కేసుల మీదే మాట్లాడేవారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా చెప్పిన సందర్భాలను చూశామన్నారు. ఈరోజున జగన్ మంచితనాన్ని, రాజశేఖర్ రెడ్డి మాదిరిగా పేద ప్రజల్లో జీవితాల్లో ఆనందాలు నింపాలనే ఆలోచనని ప్రజలు గ్రహించారు అన్నారు. తప్పు చేయని జగన్ ను ఎవరైనా కొన్ని రోజులు మాత్రమే ఇబ్బంది పెట్టగలరనీ, ఎక్కువ రోజులు ఇబ్బందులకు గురి చెయ్యలేరన్నారు రోజా. కడిగిన ముత్యంలా జగన్ బయటకి వస్తారన్నారు రోజా.
మహిళలపై దాడులు అనే టాపిక్ మాట్లాడుతూ… అసెంబ్లీ నుంచి తనను ఏడాదిపాటు సస్పెన్షన్ కూడా ఆ అకౌంట్లో చెప్పే ప్రయత్నం రోజా చేయడం ఆశ్చర్యంగా ఉంది! ఎందుకంటే, అసెంబ్లీలో ఆమె ప్రవర్తించిన తీరేంటో అందరూ చూశారు. ఆరోజున ఆమె మహిళా సమస్యలపై అసెంబ్లీ పోరాడితే సస్పెండ్ చెయ్యలేదు కదా..! సభలో ఆమె వాడిన పదజాలం, ప్రవర్తించిన తీరుకు సంబంధించిన వీడియో ఫుటేజ్ ని నాడు అసెంబ్లీ విడుదల చేసింది. సభలో తన ప్రవర్తన కారణంగానే ఏడాది సస్పెండ్ అయ్యారు, దానికీ మహిళా సాధికారతపై దాడికీ సంబంధమేంటి..? తన సస్పెన్షన్ ను కూడా మహిళలపై జరిగిన దాడిగా రోజా ఇవాళ్ల చెప్పుకుంటున్నంత మాత్రాన.. గతం ప్రజలకు గుర్తుండదు అనుకుంటున్నారేమో మరి!