jagan, Attack on Jagan
ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో దాడి జరిగింది. విశాఖ నుంచి హైదరాబాద్ కు బయల్దేరిన జగన్.. ఎయిర్ పోర్ట్ లాంజ్ లో ఉండగా… అనూహ్యంగా ఒక వెయిటర్ కత్తి తో దాడి చేసే ప్రయత్నం చేసినట్టు సమాచారం. ఆ వ్యక్తిని శ్రీనివాస్ గా గుర్తించినట్టు తెలుస్తోంది. అతడు స్థానిక క్యాంటిన్లోనే పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. వెంటనే స్పందించిన విమానాశ్రయ సిబ్బందిని ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని, పోలీసులకు అప్పగించినట్టుగా తెలుస్తోంది. ఈ దాడిలో జగన్ ఎడమ భుజానికి స్వల్ప గాయమైంది. ప్రతీ గురువారం పాదయాత్ర మధ్యాహ్నమే ముగించుకుని హైదరాబాద్ కు జగన్ చేరుకుంటారనే సంగతి తెలిసిందే. ప్రతీ శుక్రవారం ఆయన కోర్టు హాజరు కావాల్సి ఉంది. ఈ క్రమంలో వైజాగ్ నుంచి ఆయన హైదరాబాద్ కి బయల్దేరారు.
అయితే, ఈ దాడికి పాల్పడ్డ శ్రీనివాస్ ఎవరు, ఎందుకు ఇలా చేశారనేది ఇంకా తెలియాల్సి ఉంది. సెల్ఫీ తీసుకుంటానంటూ అతడు జగన్ దగ్గరకి వచ్చినట్టు సమాచారం. ఆ తరువాత, అనూహ్యంగా జగన్ పై దాడి చేసినట్టు ప్రాథమిక సమాచారం అందుతోంది. వెంటనే జగన్ అలెర్ట్ అయి పక్కకు జరిగారు, పక్కనే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది కూడా వెంటనే అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో శ్రీనివాస్ చేతిలో ఉన్న చిన్నపాటి కత్తి జగన్ భుజానికి తాకి, గాయమైంది. ఈ దాడితో వైకాపా వర్గాలన్నీ ఒక్కసారి షాక్ అయ్యాయని చెప్పొచ్చు. ఇది భద్రతా వైఫల్యమంటూ వైకాపా నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.