ప్రస్తుతం విజయనగరం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్.. అక్రమాస్తుల కేసులో రేపు నాంపల్లిలోని న్యాయస్థానంలో హాజరుకావాల్సి ఉంది. దీంతో హైదరాబాద్ వెళ్లేందుకు మధ్యాహ్నం ఆయన విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానం బయలుదేరేందుకు సమయం ఉన్నందున వీఐపీ లాంజ్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆ సమయంలో జగన్ వద్దకు వచ్చిన వెయిటర్ ఆయనతో సెల్ఫీ తీసుకుంటూ చిన్న కత్తితో దాడి చేశాడు. అది కోళ్ల పందాలకు ఉపయోగించే కత్తి. వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనలో జగన్ ఎడమ భుజానికి గాయమైంది. వైద్యులు ఆయనకు చికిత్స అందించారు. ఆ తర్వాత ఆయన హైదరాబాద్ వెళ్లిపోయారు.
విమానాశ్రయంలోకి కత్తి ఎలా..?
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి ఘటన కలకలం సృష్టించింది. విమానాశ్రయంలో.. భద్రతా వ్యవహారం అంతా సీఐఎస్ఎఫ్ ఆధీనంలో ఉంటుంది. స్థానిక పోలీసులకు ప్రమేయం ఉండదు. లోపల ఏమైనా జరిగితే… బయట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేస్తారు కాని భద్రతా ఏర్పాట్లు మాత్రం సీఐఎస్ఎఫ్ చూస్తుంది. ఇక విమానాశ్రయంలో అత్యంత పకడ్బందీ తనిఖీ వ్యవస్థ ఉంటుంది. ఎలాంటి చిన్న మారణాయుధాల్ని కూడా అనుమతించరు. సెన్సార్లు ఉంటాయి. అలాంటి భద్రతా వ్యవస్థ ఉన్న చోట.. హత్యాయత్నం చేసిన శ్రీనివాస్ కత్తిని ఎలా తీసుకెళ్లాడనేది.. మిస్టరీగా మారింది. సోదాలు చేయడంలో… సీఐఎస్ఎఫ్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారా..? లేక… హోటల్ లో వంట అవసరాల కోసం అని లోపలికి తెచ్చారా..? లేక ముందస్తు ప్లాన్ ప్రకారమే.. అనుమతించారా.. అన్నది తేలాల్సి ఉంది..!
నిందితుడి బ్యాక్ గ్రౌండ్ ఏమిటి..?
నిందితుడిని తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి చెందిన జరిపెల్లి శ్రీనివాస్‌గా గుర్తించారు. శ్రీనివాసరావు జగన్ కు వీరాభిమాని. ఆయన తల్లిదండ్రులు ఉపాధి హామీ కూలీలు. మొత్తం ఆరుగురి సంతానంలో శ్రీనివాసరావు చివరి వాడు. ఇంకా పెళ్లి కాలేదు. ఇటీవల జగన్ కోనసీమ పాదయాత్రకు వచ్చినప్పుడు అప్పులు చేసి మరీ ఫ్లెక్సీలు కట్టాడు.. ఇద్దరు సోదరులు ఉపాధి కోసం గల్ఫ్ కు వెళ్లగా…మరో సోదరుడు బీఎస్ఎఫ్ జవాన్. ఎనిమిది నెలల క్రితమే.. హోటల్ మేనేజ్ మెంట్ కోర్సు చేస్తానని.. వైజాగ్ వెళ్లాడు. శ్రీనివాసరావు మానసిక స్థితి బాగానే ఉందని… గ్రామంలోని ఆయన తల్లిదండ్రులు చెబుతున్నారు.
నిందితుడు ఏ ఉద్దేశంతో దాడి చేశాడు..?
నిందితుడు ఆరు రకాల ఐఎంఈఐ నెంబర్లు ఉన్న ఫోన్లు ఉపయోగించారు. ఇందులో నాలుగు యాక్టివ్ గా ఉపయోగిస్తున్నారు. వీటి నుంచి ఏ ఏ నెంబర్లకు కాల్స్ వెళ్లాయో పరిశీలిస్తున్నారు. పబ్లిసిటీ కోసమే అతడు ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోందని డీజీపీ వ్యాఖ్యానించారు. నిందితుడి వద్ద 10 పేజీల లేఖ ఉందని.. దాన్ని సీఐఎస్ఎఫ్ సిబ్బంది రాష్ట్ర పోలీసులకు అందించారని చెప్పారు. ఆ లేఖపై విచారణ జరిపి వివరాలనున త్వరలోనే మీడియాకు వెల్లడిస్తామని ఆర్పీ ఠాకూర్ తెలిపారు.
ఎవరి స్పందన ఎలా ఉంది..?
విమానాశ్రంలో దాడి విషయం తెలియగానే.. కేంద్ర మంత్రి సురేష్ ప్రభు ముందుగా స్పందించారు. అన్ని దర్యాప్తు సంస్థల విచారణకు ఆదేశించారు. మరో వైపీ జీవీఎల్ నరసింహారావు క్షణాల్లోట్వీట్ చేశారు. సురక్షితంగా భావించే విమానాశ్రయంలోనే దాడి జరగడం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ఏపీ డీజీపీ ఠాకూర్‌కు ఫోన్ చేశారు. జగన్‌పై దాడి ఘటనకు సంబంధించి వెంటనే తనకు పూర్తిస్థాయి నివేదిక పంపించాలని గవర్నర్ ఆదేశించారు ఏపీ ప్రభుత్వమే దాడి చేయించిందని వైసీపీ నేతలు ట్విట్టర్ లో ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తోంది.
సార్ 160 సీట్లు వస్తాయా అంటూ పలకరించాడు. అనంతరం సెల్ఫీ దిగుతానంటూ దాడికి పాల్పడ్డారు.