ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి మీద విశాఖ విమానాశ్రయంలో శ్రీనివాస్ అనే వ్యక్తి దాడి చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఇదే అంశంపై వైకాపా నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు కూడా దాడిపై స్పందించారు. అయితే, ఈ ఘటనపై ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తే… దానికి ధీటుగా వైకాపా నేతల అంబటి రాంబాబు కూడా కొన్ని విమర్శలు చేశారు.
అచ్చెన్నాయుడు ఏమంటారంటే… జగన్ పై దాడి ఘటనను చూస్తుంటే ఇది ఆపరేషన్ గరుడలో భాగమనే అనుమానం కలుగుతోందన్నారు. దాడి జరిగిన వెంటనే జగన్ పోలీసులకు ఫిర్యాదు చెయ్యాల్సి ఉందనీ, ఆసుపత్రిలో చేరాల్సి ఉందనీ, ఆ తరువాత వైద్యుల సలహా మేరకు ఆయన వెళ్లాలనీ, కానీ ఇక్కడ అలా జరగలేదన్నారు. దాడి జరిగిన తరువాత జగన్ నవ్వుకుంటూనే హైదరాబాద్ వెళ్లిపోయారనీ, అక్కడి డాక్టర్లను కలిస్తే.. ఏమీ ఇబ్బందిలేదు ఇంటికెళ్లిపోమంటే వెళ్లిపోయారనీ, ఆ తరువాత మళ్లీ ఆసుపత్రికి వచ్చి మంచం మీద ఉన్నట్టు మీడియాలో కథనాలు వస్తున్నాయన్నారు. ఈ ఘటనతో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న సంబంధం ఏంటన్నారు. 3000 కిలో మీటర్లు పాదయాత్ర చేస్తుంటే… ఎక్కడా ఎలాంటి ఇబ్బందీ రాకుండా రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుని పోలీసులు బందోబస్తు ఇచ్చామన్నారు. కానీ, రాష్ట్రానికి సంబంధం లేని.. సి.ఐ.ఎస్.ఎఫ్. పరిధిలో ఉన్న విమానాశ్రయంలో ఘటన జరిగిందన్నారు. దాడి చేసిన వ్యక్తి వైకాపా వీరాభిమానే అని కనిపిస్తున్నా కూడా విమర్శలు చేయడం దారుణమన్నారు.
అంబటి రాంబాబు ఏమన్నారంటే… జగన్ పై దాడి తరువాత డీజీజీ మీడియా ముందుకు వచ్చి శ్రీనివాస్ ఎస్సీ కులానికి చెందినవాడని చెప్పారు. ఇలా చెబుతూనే ఇది ప్రచారార్భాటం కోసం చేసిన పని ఆయన వ్యాఖ్యానించడం సరికాదన్నారు. ఇలాంటి పోలీస్ బాస్ ఉంటే… విచారణ సక్రమంగా ఎలా సాగుతుందన్నారు. ఎవరి ఒత్తిడి మేరకు డీజీపీ ఠాకూర్ ఇలా మాట్లాడారో చెప్పాలన్నారు. దాడి చేసిన వ్యక్తి జగన్ అభిమాని అని చెప్పారుగానీ… ఆయన పనిచేస్తున్న క్యాంటీన్ యజమాని ఎవరో ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. ఆ యజమాని పేరు తొట్టెంపూడి హర్షవర్థన్ ప్రసాద్ అనీ, ఆయన టీడీపీ వ్యక్తి అని అంబటి చెప్పారు. ఈ దాడి జరిగిన తరువాత ఏపీ మంత్రులు తత్తరపాటు పడుతూ ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారన్నారు. గత ఏడాది జనవరిలో కొవ్వొత్తుల ప్రదర్శన కోసం జగన్ తో సహా తాము విశాఖ వెళ్లామనీ, అప్పుడు రాష్ట్ర పోలీసులే ఎయిర్ పోర్టులోకి వచ్చి అరెస్టులు చేశారని గుర్తు చేశారు. కానీ, విశాఖ విమానాశ్రయం భద్రత అంతా సి.ఐ.ఎస్.ఎఫ్. పరిధిలో ఉంటుందని మంత్రులు ఇప్పుడు చెప్పడం ఎంత వరకూ సబబు అని ప్రశ్నించారు. గతంలో అలిపిరి వద్ద చంద్రబాబుపై దాడి జరిగితే, నాడు వైయస్ రాజశేఖర్ రెడ్డి నిరసన తెలుపుతూ దీక్ష చేశారనీ, నేడు ప్రతిపక్ష నేతపై దాడి జరిగితే టీడీపీ నేతలు ఖండించడం లేదన్నారు.
జగన్ పై దాడి విషయంలో తమకు అనుమానాలు ఉన్నాయని వైకాపా నేతలు అంటుంటే… తమకూ చాలా సందేహాలున్నాయని టీడీపీ నేతలు అంటున్నారు. ఎవరివాదనను వారు బలంగా వినిపించే విధంగా లాజిక్ లు మాట్లాడుతున్నారు. సమగ్ర దర్యాప్తు జరిగితేగానీ వాస్తవాలు బయటకి రావు. కానీ, ఆ దర్యాప్తుపై కూడా వైకాపా నేతలు ఇప్పట్నుంచే అనుమానాలు వ్యక్తం చేయడం ప్రారంభించేశారు.