ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిపై దాడి జరిగింది. దాన్ని కచ్చితంగా ఖండించాల్సిందే. అదృష్టవశాత్తూ జగన్ స్వల్పగాయాలతో బయటపడ్డారనే చెప్పొచ్చు. అయితే, దాడికి పాల్పడ్డ శ్రీనివాస్ ఉద్దేశమేంటీ, ఏ పరిస్థితుల్లో దాడి చేశాడు, విమానాశ్రయంలోకి కత్తి ఎలా వచ్చింది.. ఇలాంటి అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే, ఇక్కడ మరో పార్శ్వం ఏంటంటే… ఈ ఘటన పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. భాజపా ఎంపీ జీవీఎల్ నర్సింహారావు అతిగా స్పందించడం మొదలుకొని, ఏపీలో అధికార ప్రతిపక్షాల మధ్య వాగ్వాదాలకు ఈ దాడి ఘటన కేంద్ర బిందువుగా మారిపోయింది. జగన్ పై దాడి ఘటనను రాజకీయ పార్టీలు చూస్తున్న తీరును గమనిస్తుంటే… ఈ అంశాన్ని ఎన్నికల వరకూ తీవ్ర చర్చనీయంగా ఉండే క్రమమే కనిపిస్తోంది.
భవిష్యత్తులో వైకాపా కార్యక్రమాల్లో జగన్ పై దాడి అనేది సహజంగానే ప్రముఖమైన అంశం అవుతుంది. దీన్ని మరో పదునైన విమర్శనాస్త్రంగా మార్చుకుని అధికార టీడీపీపై గతానికి మించిన విమర్శలు ఆ పార్టీ నేతలు చేస్తారు. ఇక, టీడీపీ విషయానికొస్తే… ఇదంతా ఒక భారీ కుట్రలో భాగమనీ, దాని వెనక నేపథ్యం వేరు అంటూ ఆ పార్టీ చెబుతూనే ఉంటుంది. చంద్రబాబు ప్రభుత్వాన్ని అస్థిరపరచాలన్న ఒక భారీ కుట్రలో భాగంగానే అన్ని పార్టీలూ ఏకమై.. కేంద్రంలోని భాజపా డైరెక్షన్లో నడుస్తున్నాయంటూ టీడీపీ నేతలూ విమర్శిస్తూ ఉంటారు. ఇక, భాజపా విషయానికొస్తే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. జగన్ మీద దాడి వార్త తెలిసిన వెంటనే ఎంపీ జీవీఎల్ స్పందనలోనే భాజపా భవిష్యత్తు విమర్శల వ్యూహం ఎలా ఉండబోతోందనేది దాదాపు అర్థమైపోయింది. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందనీ, సాక్షాత్తూ ప్రతిపక్ష నేతకే అక్కడ భద్రత లేదనీ, తీవ్రమైన అస్థిరత్వం ఆంధ్రాలో ఉందనీ… ఇలాంటి లైన్ ఎత్తుకుని రాష్ట్ర ప్రభుత్వం మీద ఎదురుదాడికి వారు దిగుతారనడంలో సందేహం లేదు. ఇలా వైకాపా, భాజపాలు ఏదో ఒక అంశాన్ని బలంగా వినిపిస్తూ… ఏపీ ప్రభుత్వంపై దాడికే ప్రయత్నిస్తాయనడంలో సందేహం లేదు.
అయితే, ఈ క్రమంలో రాజకీయంగా టీడీపీకి కలిసొచ్చే పాయింట్లు రెండే రెండు ఉన్నాయి! మొదటిది… విమానాశ్రయం లోపల జగన్ మీద దాడి జరగడం, ఆ ప్రాంతం కేంద్ర భద్రతా పరిధిలో ఉండటం! ఈ పాయింట్ ని ఆధారంగా చేసుకుని.. ఆపరేషన్ గరుడను తెర మీదికి తీసుకొచ్చి టీడీపీ తమ వాణిని బలంగా వినిపించే అవకాశం ఉంది. ఇక, రెండోది… ఇప్పటివరకూ ఉన్న సమాచారం ప్రకారం దాడికి పాల్పడ్డ వ్యక్తి వైకాపా అభిమాని కావడం. అయితే, పోలీసుల దర్యాప్తులో ఈ వ్యక్తికి సంబంధించిన మరిన్ని వివరాలు బయటకి రావాల్సి ఉంది. మొత్తానికి, ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చే వరకూ ఈ దాడి ఘటన చుట్టూ రాజకీయ కుట్ర కోణాలతో రకరకాల అభిప్రాయాలు చక్కర్లు కొడుతూనే ఉంటాయనే కనిపిస్తోంది. వైకాపా, భాజపా, టీడీపీ… ఈ మూడు పార్టీల మధ్యా ఈ వ్యవహారం నానుతూ ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.