హైదరాబాదును విశ్వనగరంగా చేస్తామని మంత్రి కెటిఆర్ విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. కాదు మా తాత, తండ్రి ఇప్పటికే దాన్ని అభివృద్ధి చేశారని లోకేష్ బాబు చెప్పుకుంటున్నారు. అసలు మీ అందరినీ మించి ఈ దశకు తెచ్చింది మా పాలనేనని కాంగ్రెస్ నాయకులూ తమ పల్లవి తాము ఆలపిస్తున్నారు. అయితే అన్ని పార్టీలూ…ఇతరుల పాలన కారణంగానే ప్రజా సమస్యలు పేరుకుపోయాయంటూ పరిష్కారం కావాలంటున్నాయి. ట్రాఫిక్, డ్రైనేజీ, శాం భద్రతల వంటి అంశాలు ప్రస్తావిస్తున్నాయి. టాప్ సిటీ కాదు సేఫ్ సిటీగా చేయాలని ప్రతిపక్షాలు చెబుతున్నాయి.
మరో వైపున లూప్లైన్లో తన ప్రచారం చేసుకుంటూ పోయే మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ బిజెపి, టిడిపి గెలిస్తే నగరంలో బీఫ్ తినే అవకాశం వుండదని ఆరోపించారు. ఆ వెంటనే కొన్ని ఛానళ్లు దానిపై దుమారం సృష్టించే ప్రయత్నం చేశాయి. మామూలుగా ఏదైనా బల్లగుద్ది వాదించే టిఆర్ఎస్ ఎంఎల్ఎ దీనిపై ఎటూ కాకుండా మాట్లాడారు. బీప్కు అనుకూలంగా లేక వ్యతిరేకంగా మాట్లాడితే నష్టమని నానాతంటాలు పడ్డారు. అదే చర్చలో కాంగ్రెస్ మాజీ ఎంపి ఒవైసీ వ్యాఖ్యలను ఖండిస్తూ టిఆర్ఎస్ వైఖరి చెప్పాలని రెట్టించి అడిగారు.
ఇక ప్రచారంలో ప్రవేశించిన సీనియర్ కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు వచ్చీ రాగానే బీఫ్ గురించిన వివాదాన్నే ప్రధానంగా తీసుకుని మతతత్వాలు రగుల్కొల్పరాదని సూక్తులు చెప్పారు. ఆహారం వేష భాషలు వంటి విషయాల్లో వారి వారి ఇష్ట ప్రకారం వ్యవహరించవచ్చునని అంతా అనుకుంటున్నప్పుడు బీఫ్పై లేనిపోని వివాదం అవసరమా? ఒవైసీ మాటలను నిజంగా ఖండించాలంటే టిఆర్ఎస్ తాము ఏ అహారానికి వ్యతిరేకం కాదని ప్రకటించాలి. కాని కర్ర విరగకుండా పాము చావకుండా వుండాలంటే బీఫ్పై సేఫ్గా బయిటపడాలని టిఆర్ఎస్ భావిస్తున్నది.