తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది.ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై మహాకూటమి నేతలు నిన్న ఇచ్చిన ఫిర్యాదులపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఈ మేరకు ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్‌కుమార్ తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డిని నివేదిక కోరారు. ఎవరివైనా ఫోన్లు ట్యాపింగ్ జరుగుతోందా? చేస్తే ఎవరెవరివి ట్యాప్ చేస్తున్నారో వివరాలు ఇవ్వాలని కోరారు. వాహనాల తనిఖీలో భాగంగా ప్రతిపక్ష నాయకులను వ్యక్తిగతంగా వేధిస్తూ, కేసుల్లో ఇరికించేందుకు కుట్రలు చేస్తున్నారని, సెల్ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని మహాకూటమి నేతలు నిన్న ఆరోపించారు.
కూటమి భాగస్వామ్య పార్టీల నాయకులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎల్.రమణ, చాడ వెంకట్‌రెడ్డి, దిలీప్‌కుమార్, రావుల చంద్రశేఖర్రెడ్డిలు గురువారం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌తో భేటీ అయ్యారు. ట్యాపింగ్ చేస్తున్నారంటూ కొన్ని ఆధారాలు సమర్పించారు.నిజానికి ఫోన్ ట్యాపింగ్ అంశం.. తెలంగాణలో చాలా రోజులుగా హాట్ టాపిక్ అవుతోంది. ఒక్క ప్రతిపక్ష నేతలవే కాదు.. టీఆర్ఎస్ నేతల ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. చివరికి వాట్సాప్ కాల్స్ ను కూడా ట్రాక్ చేయడానికి అవసరమైన పరిజ్ఞానాన్ని తెలంగాణ ప్రభుత్వం సమకూర్చుకుందని మీడియాలో కూడా ప్రచారం జరిగింది.
కొన్ని రాజకీయ పార్టీల నేతలు.. ఫోన్లలో మాట్లాడుకున్న మాటలు.. టీఆర్ఎస్ హైకమాండ్ కు తెలిసిపోవడం.. దానికి తగ్గట్లుగా… అధికార పార్టీ కొన్ని చర్యలు తీసుకోవడంతో.. వారిలో అనుమానం బలపడింది. ఎల్. రమణ, కోదండరాం సహా పలువురు తమ ఫోన్లు ట్యాప్ అవుతున్నట్లు గుర్తించారు. అయితే .. తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ఫోన్లు ట్యాపింగ్ చేసే అవకాశం లేదు. అంతా అనధికారికంగానే ట్యాపింగ్ చేస్తూంటారు. కాబట్టి.. ఎలాంటి ఫోన్లు ట్యాపింగ్ చేయడం లేదన్న సమాచారం… ఈసీకి పోలీస్ బాస్ ఇచ్చే అవకాశం ఉంది.