ఏపీ ప్రతిపక్ష నేత జగన్ ప్రతీ శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరౌతారన్న సంగతి తెలిసిందే. ఆయనపై అక్రమ ఆస్తుల కేసులు నమోదైన సంగతీ తెలిసిందే. అలా హాజరు కావడానికే ఆయన వైజాగ్ నుంచి హైదరాబాద్ వస్తుంటే విమానాశ్రయంలో దాడి జరిగింది. అయితే, విశాఖలో దాడి జరిగిన నేపథ్యంలో ఆయన ఈ శుక్రవారం కోర్టు హాజరు కాలేదు. గాయం నేపథ్యంలో ఆయన సీబీఐ కోర్టులో పిటీషన్ వేయడంతో… వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు అనుమతి లభించింది. అయితే, ఇప్పుడు జగన్ పై విచారణ దశలో ఉన్న కేసులకు సంబంధించిన ఓ అంశం చర్చల్లోకి కీలకంగా వస్తోంది. ప్రస్తుతం ప్రతీవారం జగన్ హాజరౌతున్న కేసుల విచారణ దాదాపుగా చివరి దశకు వచ్చిందనే అభిప్రాయం వినిపిస్తోంది.
దీంతో, ఇకపై వారానికి ఒకసారి కాకుండా… వారంలో మూడు లేదా నాలుగు రోజులపాటు కోర్టుకు జగన్మోహన్ రెడ్డి వెళ్లాల్సిన అవసరం కూడా ఉంటుందనేది వినిపిస్తోంది! అలాంటి సమయంలో వ్యక్తిగత హాజరీకి మినహాయింపు కోరుతూ న్యాయవాది ద్వారా పిటీషన్లు వేసినా అనుమతించే పరిస్థితి ఉండకపోవచ్చనీ కొందరు అంటున్నారు. ఇంకోపక్క ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి… ఇలాంటి సమయంలో వారంలో కొన్ని రోజులు కోర్టుకే వెళ్లాల్సి వస్తే పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితే అవుతుందనే చర్చ కూడా వైకాపా వర్గాల్లో మొదలైనట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. పాదయాత్ర ఎలాగూ ఇంకొన్నాళ్లలో పూర్తవుతుంది. కానీ, కీలకమైన ఎన్నికల ప్రచారం అనేది మున్ముందు ఉంటుంది. అలాంటి సమయంలో కోర్టులో చివరి దశ వాదనలు ఉంటే ఎలా అనేదే ఇప్పుడు చర్చనీయమౌతోందట. అయితే, దీనికి అనుగుణంగా ఇప్పట్నుంచే వ్యూహాత్మకంగా వ్యవహరించాలనే ప్రణాళికపై కూడా చర్చలు జరుగుతున్నాయట..!
దీనికి సంబంధించి సీబీఐ కోర్టులో తాజాగా ఒక పిటీషన్ వేసేందుకు జగన్ సిద్ధమౌతున్నట్టు వినిపిస్తోంది..! దాని సారాంశం ఏంటంటే… భవిష్యత్తులో జరగబోయే విచారణలు, చివరి దశ వాదోపవాదాలకు సంబంధించి తన అభిప్రాయాలనూ వాదనలనూ లాయరు ద్వారా కోర్టుకు తెలియజేస్తామనీ, ఈ విధమైన వెసులుబాటు కల్పిస్తూ అనుమతి ఇవ్వాలని కోర్టును కోరబోతున్నట్టు సమాచారం. ఇలాంటి పిటీషన్ దాఖలైతే.. కోర్టు ఎలా స్పందిస్తుందని అనేది ఆసక్తికరమైన అంశంగానే మారుతుంది.