ఉమ్మడి కరీంనగర్ జిల్లా మహాకూటమిలో ఎవరికి ఎన్ని సీట్లు అనే విషయంపై స్పష్టత వచ్చింది. ఏపార్టీ ఎక్కడి నుంచి పోటీ చేస్తుందనేది తేలాల్సి ఉంది. 13 నియోజకవర్గాల్లో రెండు స్థానాల్లో టీజేఎస్, ఒక స్థానంలో టీడీపీ, మరొక స్థానంలో సీపీ… మిగతా ఎనిమిది చోట్ల… కాంగ్రెస్ పోటీ చేస్తుంది. టీ-టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ కోరుట్ల నుంచి …టీ-పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ కరీంనగర్ నుంచి ..సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి హుస్నాబాద్ నుంచి పోటీచేయడం దాదాపు ఖాయమే. ఇందుకు సంబంధించిన గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. పొన్నం ప్రభాకర్ కు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆయన ప్రచారం సాగిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నారు. విమర్శల్లో పదును పెంచారు. పల్లెలను చుట్టిరావడంతో పాటు…కరీంనగర్ పట్టణంలోనూ ప్రచారం స్పీడు పెంచారు.
మరోవైపు తెలుగుదేశం పార్టీ కోరుట్ల, హుజురాబాద్, చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గాలపై మొదటి నుంచి దృష్టిపెట్టింది. కూటమికి సమర్పించిన జాబితాలో ఈ మూడింటి పేర్లు పేర్కొంది. కోరుట్ల నుంచి తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, హుజురాబాద్ నుంచి ఇనుగాల పెద్దిరెడ్డి పోటీలో ఉంటారని ప్రచారం జరిగింది. ఆతర్వాత టీడీపీ చొప్పదండిని వదిలేసి రెండు స్థానాలపైనే పట్టుబడుతూ వచ్చింది. ఇనుగాల పెద్దిరెడ్డి హుజురాబాద్ కాకుండా కూకట్ పల్లి నుంచి పోటీచేయాలని భావిస్తుండటంతో ఆపా ర్టీ ప్రస్తుతం జిల్లా నుంచి కోరుట్ల స్థానాన్ని మాత్రమే కోరుకుంటోంది. అవసరమైతే ఏ త్యాగానికైనా సిద్ధమని ప్రకటించిన టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ పట్టువిడుపు ధోరణిలో వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే మూడు స్థానాలకు కోరిన టీడీపీ కేవలం ఒక స్థానంతో సరిపెట్టుకుంటోంది.
ఇక సీపీఐ విషయానికి వస్తే…కూటమిలో మొత్తంగా నాలుగు సీట్లు కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఒకసీటు కోరుకుంటోంది ఆపార్టీ . హుస్నాబాద్ నుంచి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి పోటీచేయాలని భావిస్తున్నారు. హుస్నాబాద్ నుంచి తప్ప మరెక్కడ నుంచి పోటీచేసేది లేదని ఆయన ఇప్పటికే కుండ బద్దలు కొట్టారు. అయితే ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు అభ్యర్థులు టికెట్ ఆశిస్తున్నారు. అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, మాజీ శాసన సభ్యుడి కుమారుడు బొమ్మ శ్రీరామ్ పోటీచేయాలని భావిస్తున్నారు. అయితే కాంగ్రెస్ ప్రవీణ్ రెడ్డినే రంగంలోకి దించాలని చూస్తోంది. ఇప్పటికే ఆయన ప్రచారం కూడా ప్రారంభించారు. ఇది మిత్ర ధర్మానికి విరుద్ధమని చాడా చాడ వెంకటరెడ్డి అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సీటు విషయంలో కాంగ్రెస్ ఏ నిర్ణయం తీసుకుంటుందనే దానిపై చాడ పోటీ చేస్తారా లేదా అన్నది ఆధారపడి ఉంది.
తెలంగాణ జనసమితి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి కరీంనగర్, హుజురాబాద్, రామగుండం స్థానాల నుంచి పోటీ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ పోటీ చేయడానికి సిద్ధమవడంతో ఆపార్టీ ఈ స్థానాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేదని సమాచారం. అయినా టీజేఎస్ స్థానిక నేతలు మాత్రం ఈ సీటు కోసం పట్టుబడుతున్నారు. హుజురాబాద్ స్థానం నుంచి కరీంనగర్ జిల్లా కన్వీనర్ ముక్కెర రాజు, రామగుండం నుంచి గోపు ఐలయ్య యాదవ్ పోటీ చేస్తారని చెబుతున్నారు. టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరామ్ రామగుండం, మంచిర్యాల స్థానాల్లో ఏదో ఒకటి పోటీచేస్తారని ప్రచారం జరిగింది. సింగరేణి కార్మికులు అధికంగా ఉన్న ఈనియోజకవర్గాల్లో టీజేఎస్ కు సానూకూల వాతావరణం ఉందని, వ్యక్తిగతంగా కోదండరామ్ కు ఉద్యమ మూల కేంద్రాలైన ఈనియోజకవర్గాల్లో పట్టు ఉందని చెబుతున్నారు. అసలు కోదండరామ్ పోటీలో ఉంటారా లేదా అనేది త్వరలోనే తేలే అవకాశం ఉంది.