విశాఖపట్నం విమానాశ్రయంలో జగన్ పై జరిగిన దాడిని… ఒక సాధారణ ఘటనగా కాకుండా, భారీ హత్యాయత్నంగానే సాక్షి చూపించే ప్రయత్నం చేస్తోంది. ఈరోజు సాక్షి పత్రికలో ఆ కోణం నుంచే పెద్ద సంఖ్యలో కథనాలను వండివార్చారు. వైకాపా నాయకులు డిమాండ్ చేస్తున్నారని చెబుతూ…. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ఎక్యూజ్డ్ వన్ అనీ, డీజీపీ అక్యూజ్డ్ టు అంటూ రాసేశారు! ఈ ముఖ్యమంత్రి మీదా, డీజీపీ మీదా నమ్మకం లేదనీ, అసలీ సర్కారు పాలనలో తమకు న్యాయం జరుగుతుందన్న విశ్వాసం ఇసేమంతైనా లేదని సాక్షి రాసేసింది.
ఇక, కోడిపందాల కత్తితో దాడికి పాల్పడ్డ శ్రీనివాస్ కి ప్రొఫెషనల్ కిల్లర్ తో టీడీపీ నాయకులే తర్ఫీదు ఇప్పించారంటూ మరో కథనంలో రాశారు. అయితే, ఆ మాటలను కూడా కాస్త కన్వీనియంట్ గా ఠాణేలంక ప్రజలు చెబుతున్నారంటూ కథనంలో పేర్కొన్నారు. అంతేకాదు, శ్రీనివాస్ కి పెద్ద మొత్తం సొమ్ము అందిందనీ, జగన్ ను హత్య చేసేందుకు ఇప్పటికే రెండుసార్లు రెక్కీ కూడా నిర్వహించాడనీ, టీడీపీ నేతల పథకం ప్రకారమే విశాఖ విమానాశ్రయంలోని రెస్టారెంట్ లో అతడిని ఉద్యోగంలో పెట్టారని కూడా చెప్పారు. ఇంకోపక్క, ఇదంతా టీడీపీ కుట్ర అని కాకుండా, భాజపా కుట్ర అని ప్రజలను నమ్మించేందుకే సినీ నటుడు శివాజీతో ఆపరేషన్ గరుడ అంటూ కొన్ని నెలల ముందు నుంచే భారీ ఎత్తున ఊదరగొట్టడం కూడా టీడీపీ ప్లాన్ లో భాగమేనట..! ప్రతిపక్ష నేత అడ్డు తొలగించుకోవడం ద్వారా మరోసారి అధికారం సాధిచుకోవాలన్నది టీడీపీ వ్యూహం అనేశారు. ఇలా ఒకటనేంది… నేటి సాక్షి పత్రికలో ‘ఇది చంద్రబాబు కుట్రే’ అని నిరూపించేందుకు అనుకూలమైన వాదనల్ని వినిపించే విధంగా ఫుంఖానుపుంఖాలుగా కథనాలు రాసింది సాక్షి.
వాస్తవాలు ప్రజలు గమనిస్తున్నారు. జరిగింది ప్రమాదమే.. ఎవ్వరూ కాదనరు. తాను సానుభూతి కోసమే చేశానంటూ శ్రీనివాస్ కూడా వాంగ్మూలం ఇచ్చాడు. జగన్ అన్న మీద ఇష్టంతోనే ఇలా చేశానని బహిరంగంగానే చెబుతున్నాడు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సి బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది కాబట్టి… దర్యాప్తునకు ఆదేశించింది. కానీ, బాధ్యత గల ప్రతిపక్ష నేతగా దర్యాప్తునకు సహకరించకుండా… ఈ వ్యవస్థలపై నమ్మకం లేదూ అంటే ఎలా..? ఒక పత్రికగా సాక్షి కూడా ఇదే వాదనను వినిపించింది. రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలపై నమ్మకం లేదని ఇష్టం వచ్చినట్టు రాసేశారు! పోలీసు వ్యవస్థలపై నమ్మకం లేదట. మరి, జగన్ పాదయాత్ర చేస్తుంటే ఏ పోలీసులు ఇన్నాళ్లూ రక్షణగా నిలుస్తూ వచ్చారు? ఏ ప్రభుత్వం ఆయన రక్షణ బాధ్యతను చూసుకుంటూ వచ్చింది..?
జగన్ పై జరిగిన దాడిని పెద్దగా చూపిస్తూ… దానితో వీలైనంత సానుభూతిని పొంది రాజకీయ లబ్ధి కోసం సాక్షి పాకులాడుతున్నట్టుగా ఉంది. దాడిని ఖండించడం వరకూ ప్రజలు హర్షిస్తారేమోగానీ… రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలపై నమ్మకం లేదు, ముఖ్యమంత్రీ డీజీపీలు అక్యూజ్డ్ అంటూ ఒక పత్రిక తీర్మానించేస్తే ఎలా..? ‘ఈ సర్కారు పాలనలో తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకం లేదు’ అనడంలోనే వారు ఆశిస్తున్నది ఏంటనేది కనిపిస్తోంది.