వెంకటేష్, నాగచైతన్య కథానాయకులుగా సురేష్‌ప్రొడక్షన్స్ ఓ సినిమాని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తోంది. అయితే.. కథ సిద్ధమైనా ఇప్పటి వరకూ ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లలేదు. మధ్యలో దర్శకులూ మారారు. బాబి ఈ ప్రాజెక్టులోకి వచ్చి చాలా కాలం అయినా, ఇప్పటి వరకూ ఈసినిమా ఊసే బయటకు రాలేదు. దాంతో ఈ సినిమా ఆగిపోయిందేమో అన్న అనుమానాలు బయటకు వచ్చాయి. వీటిపై చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది. ఈ కాంబినేషన్లో సినిమాఉంటుందని, `వెంకీ మామ` సెట్స్‌పైకి వెళ్తుందని తేల్చి చెప్పింది. అటు వెంకటేష్, ఇటు నాగచైతన్య వరుస సినిమాలతో బిజీగా ఉండడం వల్ల ఈ ప్రాజెక్టు ఆలస్యమైందని, నవంబరు రెండో వారంలో షూటింగ్మొదలవుతుందని చిత్రబృందం ప్రకటించింది. `సవ్యసాచి` విడుదల తరవాత చైతూ ఖాళీ. ఎఫ్ 2 అయ్యాక వెంకీ.. ఈ సినిమా షూటింగ్లో పాలుపంచుకుంటాడు. ముందు చైతూపై కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తారని, ఆ తరవాతే వెంకీ సెట్లో అడుగుపెడతాడని తెలుస్తోంది. ప్రముఖ రచయిత జనార్థన మహర్షి ఈ చిత్రానికి కథ అందించారు. కథానాయికలు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో ప్రకటిస్తారు.