‘సవ్యసాచి’ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో సినిమా కంటెంట్ గురించి నాగచైతన్య కాసేపే మాట్లాడారు. బహుశా… టీజర్లో, ట్రైలర్లో కాన్సెప్ట్ చెప్పేశామనే ఫీలింగ్ అనుకుంట! అదే సమయంలో మాధవన్ ఒక్కరినీ మినహాయిస్తే కాస్ట్ అండ్ క్రూ గురించి మాట్లాడినదీ తక్కువే! ఎక్కువ సమయం అభిమానుల గురించి మాట్లాడటం కోసం కేటాయించారు. అభిమానులను కొన్నిసార్లు డిజప్పాయింట్ చేసినా… వాళ్ళు ఇచ్చే మద్దతులో, వాళ్ళు చూపించే అభిమానంలో ఏమాత్రం మార్పు లేదనీ, మరింత పెరుగుతోందనీ చైతూ అన్నాడు. మనమంతా ఎప్పుడూ ఇలాగే కలిసి వుండాలని అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు.
‘సవ్యసాచి’ డిజప్పాయింట్ చేయదని చెప్పాడు. తను చెప్పడం మాత్రమే కాదు… తన స్పీచ్ మధ్యలో దర్శకుడు చందూ మొండేటి చేతికి మైక్ ఇచ్చి, అతడితోనూ సినిమా డిజప్పాయింట్ చేయదని చెప్పించాడు. అంత ఎందుకో? గత సినిమా ఫలితం ప్రభావమా? విమర్శకులకు నచ్చకున్నా, ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమాకు వసూళ్లు బాగా వచ్చాయని నాగార్జున సంతోషపడ్డారు. బహుశా… ఆ సినిమా ఫలితంతో నాగచైతన్య పూర్తిస్థాయిలో సంతృప్తి చెందలేదేమో! ప్రతి సినిమా అభిమానులకు సంతోషాన్ని ఇవ్వాలని, వాళ్ళను శాటిస్ఫై చేయాలని సిన్సియర్‌గా కష్టపడి చేస్తానని… ఈ సినిమాకు వస్తే, తన కంటే ఎక్కువ సిన్సియర్‌గా దర్శకుడు చందూ మొండేటి కష్టపడ్డాడని నాగచైతన్య అన్నారు. సినిమా కాన్సెప్ట్ యూనిక్ అహఁయినప్పటికీ… కమర్షియల్ హంగులన్నీ వుంటాయని భరోసా ఇచ్చాడు.