నవంబర్ ఒకటో తేదీన.. అభ్యర్థుల జాబితా, మేనిఫెస్టోను విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది. ఢిల్లీ పర్యటనలోఉన్న చంద్రబాబును.. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఏపీ భవన్లో కలిశారు. ప్రజాకూటమి సీట్ల సర్దుబాటు, ఎన్నికల వ్యూహం, ఉమ్మడి ఎన్నికల ప్రణాళిక, ప్రచార వ్యూహం ఎలా ఉండాలనే దానిపై చర్చించారు. టీ టీడీపీ నేత ఎల్.రమణ కూడా సమావేశంలో పాల్గొన్నారు. ఆదివారం హైకమాండ్‌కు… ఉత్తమ్ కుమార్ రెడ్డి మేనిఫెస్టోను, అభ్యర్థుల జాబితాను అందిస్తారు. నవంబర్ 1న అభ్యర్థుల జాబితాతో పాటు అదేరోజున పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయాలని నిర్ణయించారు.
అభ్యర్థుల ఎంపికకు తుదిరూపం ఇచ్చేందుకు పార్టీ సీనియర్ నేతలతో ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ భేటీ పలుమార్లు సమావేశమైంది. కూటమిలోని ఏ పార్టీకి ఎన్నెన్ని సీట్లు కేటాయిస్తారో.. కాంగ్రెస్ ఎన్ని సీట్లలో బరిలోకి దిగుతుందో అనే విషయాలన్నీ నవంబర్ 1న తేలనుండటంతో ఈ జాబితాపై ఆసక్తి నెలకొంది. అయితే.. కూటమిలోని పార్టీలు మాత్రం.. కాంగ్రెస్ తీరుపై అంత సంతృప్తిగా లేవు. ఏకపక్షంగా కాంగ్రెస్ అభ్యర్థులు ప్రచారం చేసుకుంటున్నారు. అభ్యర్థుల ప్రకటన కూడా.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులవి మాత్రమే ప్రకటిస్తారన్నట్లుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పుకొస్తున్నారు. మరి కూటమి సీట్లు.. అభ్యర్థుల సంగతేమిటన్నది ఎవరికీ అర్థం కావడం లేదు.
ఉత్తమ్ లేకుండా… ఎల్. రమణ, కోదండరాం. చాడ వెంకటరెడ్డి.. ఆదివారం.. సమావేశం కావాలని నిర్ణయించారు. అయితే.. కూటమిలో అన్ని పార్టీల అభ్యర్థులనూ ఒకే సారి ప్రకటిస్తామని… కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.