టీఆర్ఎస్ను ఓడించేందుకు అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు పార్టీలన్నీ ఏకమై ప్రజాకూటమిగా ఏర్పడ్డాయి. కానీ సీట్ల సర్దుబాటులో జరుగుతున్న జాప్యం వరంగల్ జిల్లా ఆశావహులను ఆందోళనకు గురిచేస్తోంది. జనగామ, పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టీఆర్ఎస్ టికెట్లు ఇచ్చింది. వారు జోరుగా ప్రచారం చేస్తున్నారు. మహాకూటమి పొత్తుల్లో భాగంగా ఇప్పటివరకు సమస్య కొలిక్కి రాకపోవడంతో మూడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్, సీపీఐ, తెలుగుదేశం, టీజేఎస్ పార్టీల నుంచి టికెట్ ఆశిస్తున్న ఆశావహులు ఆందోళనకు గురవుతున్నారు. టికెట్ ఎలాగైనా తమకే వస్తుందనే ధీమాతో ఎవరికి వారు ప్రచారాలను మొదలుపెట్టి ప్రజల్లోకి వెళ్లుతున్నారు.
స్టేషన్‌ఘన్‌పూర్ ఎస్సీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం పలువురు సీనియర్ నాయకులు పోటీపడుతున్నారు. ప్రధానంగా అక్కడి నుండి మాజీ మంత్రి జి.విజయరామారావు, మాజీ ఎమ్మెల్యే బోనగిరి ఆరోగ్యం, రాష్ట్ర నాయకురాలు సింగపురం ఇందిర, మాదాసి వెంకటేశ్ టికెట్ ఆశిస్తున్నారు. వీరంతా ఎవరికి వారే ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో డీసీసీబీ మాజీ చైర్మన్, నియోజకవర్గ కాంగ్రె్‌సపార్టీ ఇన్చార్జి జంగా రాఘవరెడ్డి టికెట్ ఎలాగైనా తనకే వస్తుందనే ధీమాతో గత రెండేళ్లుగా ప్రజల్లో తిరుగుతున్నారు. మాజీ ఎమ్మెల్యే దుగ్యాల శ్రీనివాసరావు కూడా కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. మహాకూటమిలో పొత్తులు, సీట్ల ఖరారు కాకపోవడంతో జంగా రాఘవరెడ్డి అనుచరులుసైతం ఆందోళనకు గురవుతున్నారు.
జనగామ నియోజకవర్గంలో పొన్నాల లక్ష్మయ్య ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి జిల్లాకేంద్రంలో మకాంవేసి ప్రచారం ప్రారంభించారు. మహాకూటమి పొత్తుల్లో భాగంగా తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం జనగామ నుంచి పోటీచేస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది. అంతేగాకుండా పొన్నాల లక్ష్మయ్య కోడలు వైశాలి సైతం టికెట్‌కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీంతో ద్వితీయ శ్రేణి నాయకులు అయోమయంలో పడ్డారు. ఎవరికి టికెట్ ఖరారు అవుతుందో తెలియని పరిస్థితుల్లో పూర్తిస్థాయిలో ప్రచారంలో దూసుకపోలేక పోతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ ఒంటరిగా పోటీ చేయనుండగా ఇప్పటివరకు అభ్యర్థులను ప్రకటించకపోవడంతో ఆ పార్టీ టికెట్‌ను ఆశిస్తున్నవారు కూడా ప్రచారం చేయాలా వద్దా అనే సంశయంలో పడ్డారు. జిల్లాలో జనగామ నియోజకవర్గానికి ఒంటరిగా పోటీచేస్తున్న బహుజన లెఫ్ట్‌ఫ్రంట్ అభ్యర్థిగా ఇప్పటికే సీపీఎం నాయకులు రవియాదవ్‌ను ప్రకటించగా ఆయన ప్రచారం ప్రారంభించారు. నెలాఖరుకు… వరంగల్ జిల్లాలో అన్ని పార్టీల తరపున అభ్యర్థులు ఎవరన్నదానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.