రాజకీయాల్లో పైకి కనిపించేదానికంటే అగుపించనిది చాలా వుంటుంది. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిఎస్‌పి నాయకురాలు మాయావతిని కలవడంలోనూ కనిపించని కోణాలున్నాయి. ఎంపి రాజస్థాన్ ఎన్నికలలో కాంగ్రెస్‌తో కలిసేలా ఆమెను వొప్పించేందుకు వెళ్లారన్నది పైకి కనిపించే కారణం. ఇంగ్లీషులో చెప్పుకున ఆస్టెన్సిబుల్ రీజన్. నిజం కూడా కావచ్చు. దానివల్ల చంద్రబాబుకు జాతీయ స్థానం చొరవ చూపించుకునే అవకాశం వస్తుంది. అయితే అంతకంటే ముఖ్యమైన కోణం వుంది. అది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లక్నో పర్యటన బిఎస్‌పితో మంతనాల ప్రభావాన్ని తటస్థం చేయడం. ఇప్పటికే వామపక్షాలతో కలసి పనిచేస్తున్న పవన్ బిఎస్‌పికి కూడా దగ్గరవుతున్నారేమో ఆరాతీసి వీలైనంతవరకూ దాన్ని అడ్డుకోవడం. పవన్ పర్యటన సందర్భంలో మాయావతి నగరంలో లేనందువల్ల కలవడం వీలు పడలేదన్నారు. ఈ సారి కలిసేలోగా మాయావతికి బ్రీఫింగ్ ఇచ్చేస్తే ఒక పనై పోతుందని భావించి వుంటారు. తెలంగాణలో గతంలో రెండుసీట్లు గెలిచిన బిఎస్‌పికి మద్దతివ్వాలని పవన్ సూచనగా చెప్పారన్నది ఒక కథనం. ఇది కూడా చంద్రబాబుకు నచ్చేది కాదు. కాబట్టే ఒక్కదెబ్బకు రెండు పిట్టలన్నట్టు జాతీయ రాజకీయాలు తెలుగు కోణాలు కూడా కలిపి కథ నడిపించారన్న మాట. మాయావతి నిర్ణయాలలో మాయాజాలం ఎప్పుడూ ఎవరికీ అర్థం కాదు గనక ఏది ఎలా జరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు. చత్తీస్‌ఘర్‌లో ఆమె అజిత్‌జోగి ప్రాంతీయ పార్టీతోకలసి పోరాడుతున్నారు. ఇది బిజెపికి దగ్గరగా వుంటుందని చెబుతారు. ఆమె గెతంలో బిజెపి మద్దతుతోనే యుపి ముఖ్యమంత్రి అయ్యారు. ఇటీవల ఆమె ఎస్‌పితోకలవడమే ఫలితాలను తారుమారు చేసింది. ఎస్‌పి కూడా కాంగ్రెస్‌తో కలసేందుకు పెద్ద సిద్దంగా లేదు. చాలా చోట్ల కాంగ్రెస్ పరిస్థితి చంద్రబాబు కాపాడలేనంత ఘోరంగా వుందనేది నిజం. ఆ పార్టీ జాతీయ పెత్తనాన్ని సహించేందుకు ఏ ప్రాంతీయ పార్టీ సిద్ధంగా లేదు.