‘కామెడీ హీరోలు’ అనే పదం క్రమంగా సైడ్ అయిపోతోంది. అల్లరి నరేష్, సునీల్‌లాంటి వాళ్ల పప్పులే ఉడకడం లేదు. ప్రతీ సినిమాలోనూ హీరోనే కామెడీ చేసుకుంటూ వెళ్తున్నాడు. దానికి తోడు…. కేవలం నవ్వుకోవడానికే సినిమాకి వచ్చే రోజులు పోయాయి. ఇలాంటప్పుడు అలీ లాంటి వాళ్లకు సినిమా హీరోలుగా ఛాన్సులు రావడం, వాళ్లపై డబ్బులు పెట్టుబడి పెట్టడానికి నిర్మాతలు ముందుకు రావడం ఆశ్చర్యమే.
యమలీలతో హీరో అయిపోయాడు అలీ. ఆ సినిమా సూపర్ డూపర్‌హిట్. దాంతో ఏకంగా 50 సినిమాల్లో హీరోగా మెరిశాడు అలీ. అందులో హిట్టయినవి రెండో మూడో. ఆ తరవాత అలీ హీరోయిజం బాగా తగ్గిపోయింది. కామెడీ పాత్రలకు ఫిక్సయిపోయి మళ్లీ అటుపు ఓ లుక్కు వేయలేదు. మంగమ్మగారి మనవడు, హంగామా తరవాత… హీరోగా మరో ప్రయత్నం చేయలేదు అలీ. కామెడీ హీరోలు చెలరేగిపోవడం, అలీకి హాస్య నటుడి పాత్రలే గిట్టు బాటు అవ్వడంతో.. హీరోయిజం మానేశాడు. ఇప్పుడు ఇన్నేళ్లకు మళ్లీ అలీకి హీరోయిజంపై మోజు పుట్టింది. కొత్తగా ‘పండుగాడి ఫొటో స్టూడియో’ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఇందులో ఇద్దరు హీరోయిన్లున్నారు. అలీ మంచి కమెడియన్. ఇప్పటికీ.. తన పంచ్ పవర్ తగ్గలేదు. అలాగని అలీని హీరోగా చూడ్డానికి ఇప్పటి ప్రేక్షకుడు సిద్ధంగాఉన్నాడా అంటే డౌటే. ఎంత కాదన్నా.. కోటి రూపాయలు ఉంటేగానీ సినిమా పూర్తవ్వదు. ఈ రోజుల్లో కోటి రూపాయలు కూడా రిస్కే. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అలీని నమ్ముకుని సినిమాలు తీసే నిర్మాతలు ఉండడం ఆశ్చర్యంగానే తోస్తుంది. కనీసం శాటిలైట్ అవ్వకపోతుందా?? అనేది వాళ్ల ధీమా కావొచ్చు. టీవీల్లో కామెడీ బిట్లకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. కేవలం కామెడీ బిట్లతోనే ఛానళ్లు నడుస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కనీసం ఆ ఛానళ్లయినా ఇలాంటి సినిమాల్ని కొంటారని.. నిర్మాతల ఉద్దేశ్యం కావొచ్చు. ఇలాంటి ధైర్యాలే.. అలీ లాంటి వాళ్లని కూడా హీరోలని చేస్తున్నాయి.