ఈనాడు కాంపౌండ్ నుంచి రచయితగా ఎదిగిన వారిలో కులశేఖర్ మంచి ప్రతిభాశాలి. తేజ దర్శకత్వంలో మొదట్లో వచ్చిన సినిమాల్లో ఆయన రాసిన పాటలు..యువతను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత ఒకటి, రెండు సినిమాలకు దర్శకత్వం కూడా చేసిన ఆయన ఇప్పుడు.. గుళ్లో దొంగతనాలు చేస్తూ పోలీసులకు పట్టుబడటం టాలీవుడ్లో సంచలనం రేకేత్తిస్తోంది. అతి తక్కువ కాలంలోనే దాదాపు 100 సినిమాలకు పాటలు రాశారు. తేజ, ఆర్పీ పట్నాయక్ సినిమాలు అనగానే కులశేఖర్ పాటలు గుర్తొస్తాయి. చిత్రం, జయం, వసంతం, ఘర్షణ, 10 క్లాస్, నువ్వు నేను, మృగరాజు, ఔనన్నా కాదన్నా, ఇంద్ర ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలు కూడా కులశేఖర్ పాటలు రాసిన జాబితాలో ఉన్నాయి. ఇటీవలి కాలంలో.. ఎవరికీ కనిపించని కులశేఖర్.. హఠాత్తుగా.. పోలీస్ స్టేషన్లో కనబడ్డారు.
ఓ గుడి దగ్గర దొంగతనం చేశారన్న కారణంగా అరెస్ట్ చేసి.. ఓ ప్రెస్‌నోట్‌ను పోలీసులు రిలీజ్ చేశారు. గుళ్ల దగ్గర బ్యాగులు, సెల్ ఫోన్లు దొంగతనం చేస్తున్నాడనేది ఆ కేసు. అయితే ఇదే మొదటి సారి కాదు. గతంలోనూ ఇదే నేరచరిత్ర ఉంది, రాజమండ్రి జైలులో ఆరు నెలలు జైలు శిక్ష కూడా అనుభవించారు. 2013లో కాకినాడలోని బాలాత్రిపుర సుందరి అమ్మవారి శఠగోపాన్ని దొంగిలించి పోలీసులకు పట్టుబడ్డారు. అందులో శిక్షకు గురయ్యారు. బయటకు వచ్చిన తర్వాత మళ్లీ ఇప్పుడు హైదరాబాద్‌లో పట్టుబడ్డారు. అయితే కులశేఖర్‌కు ఆరోగ్య పరమైన సమస్యలు ఉన్నాయని… మెదడుకు సంబంధించిన ఓ వ్యాధి కారణంగా మెమరీని కోల్పోయాడన్న ప్రచారం జరుగుతోంది.
హైదరాబాదులో ఉన్న కులశేఖర్ కుటుంబ సభ్యులు కూడా అతని గురించి పెద్దగా పట్టించుకోవడం లేదని కులశేఖర్ మిత్రులు చెబుతున్నారు. కులశేఖర్ భార్య ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తూ ఇద్దరు పిల్లలను పోషిస్తోంది. వైజాగ్ లో అతని సోదరులు ఉన్నా వారు ఇతని గురించి పట్టించుకోలేదు. హైదరాబాదులో కూడా అతనికి అప్పులు ఉన్నాయని అందుకనే అతన్ని ఎవరూ పట్టించుకోవడం లేదని స్నేహితులు చెబుతున్నారు. గీత రచయితగా బిజీగా ఉన్నప్పుడే ప్రేమలేఖ రాశా అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఆ సినిమా విడుదలకు చాలా ఆలస్యం కావడం వల్ల కూడా అతని మానసికంగా కుంగిపోయాడన్న ప్రచారం జరుగుతోంది.