జనసేన అధినేత పవన్ కల్యాణ్ హఠాత్తుగా.. ఓ ట్వీట్ చేశారు. జనసేన పొత్తుల గురించి వార్తలు వస్తున్నాయని.. దానిపై స్పందన అన్నట్లుగా ఆ ట్వీట్ ఉంది. ” ఆ వార్తలు వింటుంటే అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన ఆ పార్టీతో కలుస్తుంది.. ఈ పార్టీతో కలుస్తుందని అంటున్నారు. సీట్ల సర్దుబాటు కూడా అయిపోయిందని ఇంకొందరు అంటున్నార. జనసేనకు ఎవరిక అండదండలు అవసరం లేద.”మన బలం జనం.. చూపిద్దాం ప్రభంజనం” అని ట్వీట్ చేశారు. నిజానికి ఇప్పుడు.. తెలుగు రాష్ట్రాల్లో జనసేన పెట్టుకునే పొత్తుల గురించి ఎవరూ ప్రస్తావించడం లేదు. ఇప్పుడు అంతా ఒకటే చర్చ జరుగుతోంది.. ఎయిర్ పోర్టులో.. జగన్ పై దాడి చేసిన శ్రీనివాసరావు.. టీడీపీ కార్యకర్తా..? జగన్ అభిమానా..? అన్నదానిపై చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో… పవన్ కల్యాణ్ తన పార్టీ పొత్తుల గురించి ఎందుకు.. ఆవేశ పడ్డారనేది.. చాలా పెద్ద క్వశ్చన్‌గా మారింది.
అయితే.. ఈ ట్వీట్లో జనసేన కార్యకర్తలకు కూడా అర్థం కాని విషయం ఒకటి ఉంది. అదే.. అసలు ఈ ట్వీట్ తెలంగాణకు ఉద్దేశించి పెట్టినదా.. లేక ఏపీకా..? అన్నది. ఎందుకంటే.. ముంగిట.. తెలంగాణ ఎన్నికలు ఉన్నాయి. మరో పదిహేను రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది. అప్పట్నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. కానీ… తెలంగాణలో భారీ ఫ్యాన్ బేస్ ఉన్న పవన్ కల్యాణ్ ఇప్పటి వరకూ పోటీపై ఎటూ తేల్చి చెప్పలేదు. కొద్ది రోజుల కిందట.. రాజమండ్రి కవాతుయాత్రకు ముందు.. తనను కలిసిన తెలంగాణ కార్యకర్తలతో 16వ తేదీన ఏదో ఒక నిర్ణయం తీసుకుందామని చెప్పి పంపించారు. పదహారు అయిపోయింది.. ఇరవై ఆరు కూడా అయిపోయింది. కానీ ఏ నిర్ణయం ప్రకటించలేదు. అసలు పోటీ చేస్తారా లేదా అన్న సస్పెన్స్ కంటిన్యూ చేస్తున్నారు. చేయకపోతే.. అదే విషయాన్ని చెప్పవచ్చు కదా..అని టిక్కెట్లపై ఆశలు పెట్టుకున్న కొంత మంది … జనసేన అఫీసు చుట్టూతిరుగుతున్నారు. అలాంటి సమయంలో వచ్చిన ఈ ట్వీట్ చూసి.. పోటీ ఖాయమేనేమో అన్న అభిప్రాయానికి వచ్చేస్తున్నారు.
అయితే.. అసలు పవన్ కల్యాణ్ మైండ్‌లో తెలంగాణ లేదని.. తెలంగాణ రాజకీయాల నుంచి ఆలోచించడం లేదని.. కేవలం ఏపీ గురించేనని.. జనసేనలోని మరికొన్ని వర్గాలు తేల్చి చెబుతున్నాయి. వైసీపీతో పొత్తు ఉంటుందని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. జగన్ పై పవన్ కల్యాణ్ సాఫ్ట్ కార్నర్ ప్రదర్శిస్తున్నారు. బీజేపీ… ప్లాన్ ఏలో ఇద్దర్నీ కలిపి పోటీ చేయించేందుకు కసరత్తు పూర్తి చేసేసిందని కూడా చెబుతున్నారు. ఇలాంటి సమయంలో.. అలాంటి వ్యవహారాలేమీ జనసేన పెట్టుకోలేదని చెప్పడానికి ఈ ట్వీట్ పెట్టారని చెబుతున్నారు. మొత్తానికి అసలు ట్వీట్లో పవర్ ఫుల్ డైలాగ్ ఉంది.. కానీ… అసలు ఏ రాష్ట్రం కోసం పెట్టారో .. అన్న క్లారిటీ కూడా ఉంటే… సూపర్ హిట్ అయి ఉండేదన్న అభిప్రాయం కూడా.. చాలా మంది జనసేన కార్యకర్తల్లో ఉంది.