తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓ ప్రత్యేకమైన స్థానం ఉన్న నియోజకవర్గం జగిత్యాల. అది టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ సొంత నియోజకవర్గం. కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా జీవన్ రెడ్డి ఉన్నారు. దీంతో.. ఎల్.రమణ తన మద్దతు జీవన్ రెడ్డికే ప్రకటించారు. దశాబ్దాలుగా.. రాజకీయ ప్రత్యర్థులుగా … ఉన్న వీరు చేతులు కలపడం… జగిత్యాలలో కొత్త సమీకరణాలకు కారణం అయింది. జగిత్యాల ప్రజల్లో రాజకీయ చైతన్యం కూడా ఎక్కువే. ఉద్యమాలకు కేరాఫ్‌గా నిలిచిన జగిత్యాల నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ , ప్రజా గొంతును ప్రభుత్వానికి వినిపిస్తూ కాంగ్రెస్ నేతగా జీవన్ రెడ్డిగా పట్టు నిలుపుకుంటున్నారు. ఓ సందర్భంలో జగిత్యాల నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలనుకున్న ఎంపీ కవిత .. ప్రత్యేకంగా ఈ నియోజకవర్గం దృష్టి పెట్టారు. అయినా చలించకుండా దీటుగా తన రాజకీయ చతురతను ప్రదర్శించారు జీవన్ రెడ్డి. చివరికి కవిత అసెంబ్లీ పోటీలో నిలబడలేదు.
జగిత్యాల టీఆర్ఎస్ అభ్యర్థిగా సంజయ్ కుమార్ పోటీ చేస్తున్నారు. ఆయనపై ఉద్యమకారుల్లో టీఆర్ఎస్ పై అసంతృప్తి నెలకొంది. టిఆర్ఎస్ అభ్యర్థి ఇంచార్జిగా నాలగేళ్లలో ఏనాడు తమని అక్కున చేర్చుకోలేదని, నేడు రమ్మంటే ఎలా వెళ్తామంటూ వారు చెబుతున్నారు. సీనియర్లుగా, పార్టీ ఇంఛార్జ్‌లుగా పని చేసిన మాకునూరి జితేందర్‌రావు, బండ భాస్కర్ రెడ్డి, ముస్కు గంగారెడ్డిలు పార్టీ అభ్యర్థిని మార్చాలని హైకమాండ్ పై ఒత్తితి తెచ్చారు. కానీ వినకపోవడంతో.. తాము కూడా పార్టీకి దూరంగా ఉంటామని ప్రకటించారు. ఒక్కొక్కరుగా టీఆర్ఎస్ను వదిలి ఉద్యమకారులు స్థానిక తాజా మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరుతున్నారు. టిఆర్ఎస్ ఉద్యమ నాయకుడు గుండా మధు 350 మంది అనుచరులతో కాంగ్రెస్ పార్టీలో చేరగా, జాగృతి జిల్లా కోకన్వీనర్ మిసాక్ అహ్మద్ సైతం పలువురు మైనార్టీ నాయకులు, యువకులతో కలిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.మరోవైపు క్రిస్టియన్ సామాజిక వర్గానికి చెందిన పద్మభూషణ్ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసి పార్టీకి సేవచేస్తూ విధేయంగా ఉన్నా ఫలితం కనిపించకపోవడం, టీఆర్ఎస్లో సముచిత స్థానం లేకపోవడం, కనీస గుర్తింపు లేకపోవడంతో పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీవైపు మొగ్గు చూపారు.
ఉద్యమకారులతో పాటు మరికొంత మంది అసమ్మతి నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి కాంగ్రెస్‌కు అండగా నిలవడంతో కాంగ్రెస్ పార్టీ నూతన కార్యకర్తలతో నూతనోత్తేజాన్ని సంతరించుకుంది. దీనికి తోడు రానున్న రోజుల్లో మరికొంత మంది నేతలు టిఆర్ఎన్ నుంచి రానున్నారనే ప్రచారం జరుగుతుండడంతో భవిష్యత్‌లో కాంగ్రెస్ మరింత బలోపేతం అవుతుందని కాంగ్రెస్ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఎంపీ కవి.. జగిత్యాల నియోజవకర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఉద్యమ కారులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నా.. ఇతర పార్టీల నుంచి నేతలు, కార్యకర్తలను ఆకర్షిస్తున్నారు.అయితే రమణ వర్గం కలసి రావడం… జీవన్ రెడ్డికి ప్లస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.