తెలంగాణలో అధికారం తమదే అనే ధీమా వ్యక్తం చేశారు భాజపా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. తాము అధికారంలోకి రాబోతున్న 20వ రాష్ట్రం తెలంగాణ అని రామ్ మాధవ్ కూడా అంటున్నారు. మహాకూటమికి నాయకత్వమే లేదని తేల్చేశారు. తెరాసకు ప్రత్యామ్నాయం తామే అని ఉద్ఘాటించారు. ఎన్నికల ప్రచార సభా వేదికలపైన ఇలాంటి ప్రసంగాలు ఎన్నైనా చెయ్యొచ్చు! కానీ, వాస్తవంలో భాజపా వ్యూహం ఏంటనేదే ఆ పార్టీ వారికీ స్పష్టతలేని అంశంగా కనిపిస్తోంది. తెలంగాణ ఏ ప్రాతిపదిక ప్రజలు భాజపాకి ఓటెయ్యాలనేది ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నుంచి రాష్ట్ర నేతల వరకూ స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ఏ అజెండాతో ప్రజల్లోకి ప్రచారంగా వెళ్లాలనే స్పష్టతను కూడా కింది స్థాయి కార్యకర్తలకు ఇవ్వలేకపోతున్నారు. పైగా, ఇప్పుడు తెలంగాణ సమాజంలో పెద్దగా చర్చకు ఆస్కారం లేని, ఈ ఎన్నికల్లో ప్రాధాన్యత ఉండని అంశాలనే భాజపా ఎత్తుకుంటూ ఉండటం గమనార్హం!
అమిత్ షా రాష్ట్రానికి వచ్చిన ప్రతీసారీ విమోచన దినం గురించి మాట్లాడతారు. మజ్లిస్ పార్టీకి భయపడి తెలంగాణ విమోచన దినాన్ని కేసీఆర్ చెయ్యడం మానేశారని అంటారు. అంతేకాదు… తాము అధికారంలోకి వస్తే ఘనంగా నిర్వహిస్తామని తాజాగా హామీ ఇచ్చారు. అమర వీరులను కేసీఆర్ మరచిపోయారంటారు. ఎంతోమంది త్యాగాల ఫలితమే తెలంగాణ అనీ, నిజమైన త్యాగాలు చేసిన వారిని కేసీఆర్ విస్మరించారని, తాము అధికారంలోకి వస్తే అందరికీ సముచిత గౌరవం దక్కుతుందంటారు. నిజానికి, రాబోయే ఎన్నికల్లో ఇవి ప్రాధాన్యతాంశాలు కావు. వీటి ప్రాతిపదిక ప్రజల తీర్పు ఉండదనేది స్పష్టంగానే ఉంది. ఇలాంటి సున్నితమైన అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా రాష్ట్రంలో భాజపా పట్టు పెంచుకోవాలని అనుకుంటోందిగానీ… అది ఈ ఎన్నికల్లో వర్కౌట్ అయ్యే వ్యూహం కానే కాదు.
తెలంగాణ వచ్చిన తరువాత జరుగుతున్న ఈ రెండో ఎన్నికల్లో ఇక్కడి ప్రధానాంశం నాలుగున్నరేళ్ల కేసీఆర్ పాలనే. తమ పాలన బాగుందని ప్రజలు విశ్వసిస్తున్నారనీ, మరోసారి అధికారం ఇస్తారన్నది తెరాస ప్రచారం. తెరాస పాలనలో ఒరిగిందేమీ లేదన్నది మహా కూటమి ప్రచారం. అంతేగానీ… తెలంగాణ విమోచన దినం లాంటి ఎమోషనల్ అంశాలకు ఈ ఎన్నికల్లో పెద్దగా ప్రాధాన్యత ఉండదు. కానీ, భాజపా తీరు చూస్తుంటే వీటిపై మాత్రమే ఆధారపడుతున్నట్టుగా ఉంది. కేసీఆర్ సర్కారు పాలనపై ధైర్యంగా విమర్శలు చేసి, నేరుగా ఆ పార్టీ పాలనను వ్యతిరేకించే స్వరం భాజపాలో కనిపించడం లేదు. ఈ ఎన్నికల్లో ఏది అత్యంత ప్రాధాన్యతాంశంగా నిలుస్తుందో, దాన్ని ప్రధానాంశంగా భాజపా పరిగణించడం లేదు.