మనకు ఏ పార్టీ అండ అక్కర్లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పెట్టిన ట్బీట్పై చాలా కథనాలే నడిచాయి. వాటికి అధికార ఛానల్ 99 ‘ జనసేన ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదు’ అని వ్యాఖ్యానం జోడించి ప్రముఖంగా ప్రసారం చేసింది గనక మరింత ప్రచారం వచ్చింది. దీనిపై నేను సంప్రదించినప్పుడు జనసేన ప్రముఖులు గాని, లేదా ఉదయం టీవీ చర్చల్లో పాల్గొన్నవారు గాని స్పష్టత ఇవ్వలేకపోయారు. ఎందుకంటే వారికి కూడా పూర్తి వివరాలు తెలియవు. వైసీపీతో జనసేన వె ళ్లడం ఖాయమైపోయినట్టు టిడిపి వర్గాలు బాగా ప్రచారం చేశాయి.ఈ ఇద్దరినీ బిజెపితో కలిపి చూపించడం ఒక వ్యూహంగా నడుస్తూనే వుంది. ఎబిఎన్ ఛానల్ ఒకసారిదీనిపై నిర్వహించిన చర్చలో కూడా నేను పాల్గొని చెప్పవలసిందే చెప్పాను. ముందస్తు వూహాగానాలు అవసరం లేదని బిజెపితో జనసేన కలిసినట్టు ఆధారాలు చూపాలని ప్యానల్లో వున్న మంత్రిగారిని కూడా కోరాను. తెలంగాణ ఎన్నికల్లో జనసేన పాల్గొనబోదని పవన్ చెప్పినట్టు వచ్చాక ఆయన టిఆర్ఎస్కు మద్దతు నిస్తారా అని ఒక చర్చ నడిచింది. ఈ లోగా లక్నో వెళ్లి బిఎస్పితో చర్చలు జరపడం కూడా ఆసక్తి పెంచింది. బిఎస్పి వస్తే వైసీపీతో గణనీయంగా వున్న దళితులలో మార్పు వస్తుందా అని ఎపి24/7 సాయి చర్చ నడిపారు. బహుశా ఇవన్నీ పవన్‌పై పనిచేసి వుండొచ్చు. సోషల్‌మీడియాలో కొన్ని కథనాలతో చిరాకు వచ్చి ఖండించి వుంటారని ఒక ప్రతినిధి నాతో అన్నారు. ఇది తెలంగాణకే పరిమితమని జనసేన నాయకుడు బొలిశెట్టి సత్యనారాయణ వెంకటకృష్న చర్చలో చెప్పారు.తమతో ఎన్నికలలో కూడా జనసేన కలిసివస్తే మంచిదే గాని రాకపోయినా అది వారి నిర్ణయమేనని సిపిఎం నాయకుడు ఎంఎ గపూర్ అదే చర్చ ఫోన్ఇన్లో వివరించడం ఆసక్తికరం.
పవన్ కొంతకాలం కిందట ఉత్తరాంధ్ర పర్యటనతో వేగం పెంచినప్పుడే వంటరిగా వెళతామన్నారు. అప్పటికే వామపక్షాలతో కలసి నడుస్తున్న రీత్యా వారితో కూడా సర్దుబాట్లు వుండవా అంటే అనేక రకాలైన సమాధానాలు వచ్చాయి. కమ్యూనిస్టు నాయకులకు మాత్రం సానుకూల సంకేతాలే ఇచ్చినట్టు అప్పట్లో నాకు తెలిసింది. అయితే ఉభయుల మద్య ఎన్నికలు సీట్లపై ఎప్పుడూ చర్చలు రాలేదు. పవన్ వక్కాణింపు కూడా ఉద్యమాలలో భాగస్వామ్యంపైనే వుంటూ వచ్చింది. సిపిఐ కార్యదర్శి రామకృష్ణ ఆయనను ఎక్కువగా కలుస్తున్నా ఆ పార్టీలో కొందరు నేతలు మాత్రం టిడిపి వైపు మొగ్గు చూపుతున్నట్టు కొన్ని కథనాలు న్నాయి. కాంగ్రెస్‌తో దేశ వ్యాపిత అవగాహనకు నిర్ణయం, తెలంగాణలో మహాకూటమి తర్వాత వీరి స్వరం పెరిగివుండొచ్చు. ఇప్పుడు జనసేనలోనూ నాయకుల రాక పెరిగింది. రకరకాల వ్యూహాలు చెప్పే వారు వాదనలు చేసేవారు కూడా వున్నారు. వంటరిగావెళ్లడమే వారి వైఖరి అయితే అప్పుడు పవన్ కళ్యాణ్ తన యాత్ర తొలి దశలో చేసిన వ్యాఖ్యలు యాదృచ్చికం కాదనీ అవి మొదటే ఆయన ఆలోచనలుగా వున్నాయని అనుకోవచ్చు.ే అండ అక్కర్లేదనడానికి పొత్తు అక్కర్లేదనడానికి తేడా వుంది గనక ఈ అర్ధోక్తుల పూర్తి అర్థమేమిటో ఆయన వివరించేవరకూ అస్పష్టత మిగిలే వుంటుంది గాని ఒంటరి పోటీ సంకేతాలే ఎక్కువగా తీసుకోవడం సహజం.
-తెలకపల్లి రవి