హీరో నాగచైతన్య, దర్శకుడు చందూ మెండేటి కాంబినేషన్లో ‘ప్రేమమ్’ హిట్ తరవాత వస్తున్న సినిమా ‘సవ్యసాచి’. దీపావళికి ముందు… నవంబర్ 2న సినిమా విడుదలవుతోంది. టీజర్లో, ట్రైలర్లో స్టోరీ కాన్సెప్ట్ ఏంటో క్లారిటీగా చెప్పారు. ‘వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్’ కాన్సెప్ట్‌తో సినిమా తెరకెక్కింది. అయితే.. సినిమాలో అదొక్కటే అసలు పాయింట్ కాదని దర్శకుడు చందూ మొండేటి చెప్పాడు. తను ఓ కథ అనుకుంటుండగా… స్నేహితుడు ఈ కాన్సెప్ట్ గురించి చెబితే విన్నాననీ, తరవాత కథలో పెట్టానని ఆయన చెప్పారు. కథలో పరిమితి మేరకు కాన్సెప్ట్ బ్లెంగ్ చేశాననీ, సినిమాలో దాంతో పాటు చక్కటి ఫ్యామిలీ ఎమోషన్స్ వున్నాయనీ తెలిపారు. ఫస్టాఫ్ అంతా లవ్, కామెడీతో సరదాగా వుంటుందనీ.. సెకండాఫ్‌లో అసలు కథ మొదలైన తరవాత ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ వుంటాయని చందూ మొండేటి చెప్పారు.
కన్నడలో ‘సంకష్ట కర గణపతి’ అని జూలై నెలాఖరున ఒక సినిమా విడుదలైంది. అందులోనూ హీరో ఎడమ చేయి అతడి మాట వినదు. ఆ సినిమా ట్రైలర్‌కి, ‘సవ్యసాచి’ ట్రైలర్‌కి చాలా పోలికలు కనిపిస్తాయి. ఈ విషయమై దర్శకుణ్ణి ప్రశ్నించగా… ‘‘ఆ సినిమా విడుదలై 2 నెలలు అయ్యింది. మా సినిమా ఎప్పుడో మొదలైంది. ఓ కాన్సెప్ట్ మీద చాలా సినిమాలు తీయవచ్చు. ఉదాహరణకు… మతిమరుపు మీద ‘గజని’ వచ్చింది. ‘భలే భలే మగాడివోయ్’ కూడా వచ్చింది కదా! మధ్యలో ఇంకో సినిమా కూడా తీయవచ్చు. ఇదీ అంతే!’’ అన్నారు. చిన్న సినిమాగా తీయాలనుకున్న ‘సవ్యసాచి’ ఇంత భారీ సినిమాగా మారడానికి మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ కారణమని, నిర్మాణంలో వారు ఎక్కడా రాజీ పడలేదనీ చందూ మొండేటి అన్నారు.