‘కార్తికేయ’ సీక్వెల్ గురించి ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. సీక్వెల్‌ని వీలైనంత త్వరగా పట్టాలు ఎక్కించాలని నిఖిల్ ప్రయత్నం. చాలా సందర్భాల్లో ‘కార్తికేయ’ సీక్వెల్ చేయాలనుందని నిఖిల్ చెప్పుకొచ్చారు. కానీ, ఇప్పట్లో ఆ సినిమా చేయడం కుదరదని దర్శకుడు చందూ మొండేటి స్పష్టం చేశారు. నిఖిల్ సెకండ్స్ ఇన్నింగ్స్‌కు ‘స్వామి రారా’ పునాది వేస్తే… ఆ తరవాత వచ్చిన ‘కార్తికేయ’ ఊపిరి పోసింది. ఆ సినిమా ప్రేక్షకులతో పాటు పరిశ్రమ వర్గాల దృష్టిని ఆకర్షించింది. నిఖిల్ స్నేహితుడు చందూ మొండేటి ‘కార్తికేయ’తో దర్శకుడిగా తెలుగుతెరకు పరిచయం అయ్యాడు. ఆ తరవాత ‘ప్రేమమ్’తో హిట్ అందుకుని, నవంబర్ 2న విడుదలకు సిద్ధమైన ‘సవ్యసాచి’ ఫలితం కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘కార్తికేయ–2’ గురించి చందూ మొండేటిని అడగ్గా… ‘‘నాకూ చేయాలని వుంది. సీక్వెల్ కోసం ఒక ఐడియా అనుకున్నా. ప్రస్తుతానికి 15 నిమిషాల కథ మాత్రమే వుంది. దాన్ని పూర్తిస్థాయి కథగా మలచడానికి చాలా సమయం పడుతుందేమో!’’ అని సమాధానం ఇచ్చారు. ‘సవ్యసాచి’ విడుదల తరవాతే ఏ సినిమా చేయబోయేదీ చెప్పగలనని ఈ యువ దర్శకుడు అన్నారు. రెండు మూడు నిర్మాణ సంస్థల దగ్గర అడ్వాన్సులు తీసుకున్నాననీ, కాకపోతే ‘సవ్యసాచి’ ఫలితంపై తరవాత సినిమా ఆధారపడి వుంటుందనీ చందూ మొండేటి తెలిపారు.