కూకట్ పల్లికి వెళ్తే ప్రో ఆంధ్రా.. మెట్ పల్లికి వెళ్తే యాంటీ అంధ్రా అన్నట్లుగా ఉంది.. టీఆర్ఎస్ నేత కేటీఆర్ ప్రచార సరళి. నిన్నటికి నిన్న కూకట్ పల్లిలో… ఆంధ్రా ఓటర్లతో మీటింగ్ పెట్టి… తియ్యటి మాటలు చెప్పిన ఆయన… ఈ రోజు ఉమ్మడి పాలమూరు జిల్లాకు వెళ్లి యాంటీ ఆంధ్రా నినాదం ఎత్తుకున్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం ఆపాలని చంద్రబాబు 30 లేఖలు రాశారని … మక్తల్ టికెట్ టీడీపీకి ఇస్తారట..వాళ్లు గెలిస్తే చంద్రబాబు మాట వింటారు
పాలమూరు ఎత్తిపోతలకు అడ్డం పడే టీడీపీకి ఓటేస్తారా? అని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తే.. జుట్టు చంద్రబాబు చేతుల్లోనే ఉంటుందంటున్నారు. ఎక్కడ ప్రచారం చేసినా… చంద్రబాబును బూచిగా చూపి.. ఆంధ్ర వ్యతిరేక వాదనను కేటీఆర్ గట్టిగా వినిపిస్తున్నారు. కేటీఆర్ మాత్రమే కాదు హరీష్ రావు.. ప్రతి సభలో.. ఆంధ్ర ప్రస్తావన తీసుకు వస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తే.. అధికారం అంతా చంద్రబాబు చేతుల్లో ఉంటుందని అది తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధమంటూ ప్రచారం చేస్తున్నారు.
ఏపీకి ప్రత్యేకహోదా వస్తే.. తెలంగాణ పరిశ్రమలన్నీ ఏపీకి తరలి పోతాయని.. హరీష్ రావు చెబుతున్నారు. ప్రాజెక్టులు ఆగిపోతాయని.. కేటీఆర్ చెబుతున్నారు. ఎంపీ కవిత కూడా అదే చెబుతున్నారు. నిజానికి మహాకూటమి ఏర్పడక ముందు తెలంగాణ వాతావరణం వేరు. ఆ తర్వాత రాజకీయం పూర్తిగా మారిపోయింది. అధికారాకానికి పోటీ పడే ఓ ప్రత్యామ్నాయం ఎదురుగా ఉందన్న అభిప్రాయం రావడంతో.. వార్ వన్ సైడ్ అన్న పరిస్థితిని పోటాపోటీగా ఉన్నట్లుగా తీరు మారిపోయింది.దీతో నిర్ణయాత్మక శక్తిగా ఉన్న సెటిలర్లను బుజ్జగించేందుకు కేటీఆర్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ బాధ్యతలను.. కేటీఆర్ తీసుకున్నారు. ఆంధ్రా ఓటర్లలో నమ్మకం కలిగించగలిగారు. ఇప్పుడు కూడా.. కేటీఆర్ అదే బాధ్యత తలకెత్తుతున్నారు. ఆంధ్రా ఓటర్లకు కేటీఆర్ బుజ్జగింపులు ప్రారంభించారు. కానీ.. అది సెటిలర్ల ఓట్లు ఉన్న చోట ఓ మాట.. లేని చోట మరో మాట చెబుతున్నారు.
చంద్రబాబును అంటే ఆంధ్రాను అన్నట్టు కాదన్న వాదనను కేటీఆర్ బలంగా వినిపిస్తున్నారు. ఇదే పాయింట్ ను టీడీపీ కూ పట్టుకుంటోంది. కేసీఆర్ ని తిడితే తెలంగాణని తిట్టినట్టే అనే సూత్రీకరణ నిజమైతే చంద్రబాబును తిడితే ఆంధ్రాను తిట్టినట్టు కాదా అని లాజిక్ తో తెలంగాణ టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి టీఆర్ఎస్ వైఖరితో.. తెలంగాణలోని ఆంధ్రా ఓటర్లు ఎటు వైపు ఉంటారన్నది.. పెద్ద పజిల్ గా మారింది. తమ కాల్లో ముచ్చుగుంటే నోటితో తీస్తామని తమ దగ్గరకు వచ్చి చెప్పే టీఆర్ఎస్ నేతలు… బయటకు వెళ్తే తమనే బూచిగా చూపిస్తూండటం.. ఆంధ్రా ఓటర్లను గందరగోళానికి గురి చేస్తోంది.