తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ మెరుపు తీగలా ప్రచారం చేస్తున్నారు. ఇప్పటి వరకూ మూడు ప్రచార సభలు మాత్రమే నిర్వహించారు. ఈ మూడు ప్రచార సభల్లో.. ఆయన తన ప్రభుత్వం చేసిన దాని గురించి ఎన్ని చెప్పుకున్నా.. కాంగ్రెస్ పార్టీ నేతల్ని ఎంత విమర్శించినా ఎవరూ పట్టించుకోలేదు. కానీ చంద్రబాబును.. విమర్శించినవే హైలెట్ అయ్యాయి. నిజామాబాద్, నల్లగొండ, వనపర్తి.. ఒక్కో సభలో.. హీట్ పెంచుకుంటూ పోయారు. వ్యక్తిగత దూషణలకు దిగారు. అవన్నీ చూసిన వారికి… తెలంగాణ ఎన్నికలు కేసీఆర్ వర్సెస్ చంద్రబాబు అన్నట్లు సాగుతున్నాయా అన్న అనుమానం రాక మానదు.
చంద్రబాబును హైలెట్ చేస్తే వచ్చే లాభం ఏమిటి..?
తెలంగాణలో మహాకూటమిలో టీడీపీ భాగస్వామ్యం అయిన తర్వాత కేసీఆర్‌లో.. టీఆర్ఎస్లో ఓ రకమైన ఆందోళన నెలకొంది. దాని ఫలితమే .. టీఆర్ఎస్ నేతల విమర్శల్లో కనిపిస్తోంది. కారణం ఏదైనా చంద్రబాబు ముందుగా.. పొత్తు ఆఫర్ టీఆర్ఎస్కే ఇచ్చారు. ఇది నచ్చకే.. రేవంత్ రెడ్డి లాంటి లాంటి నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. కానీ.. చంద్రబాబు స్నేహాన్ని… ” ఛీ ఛీ మీతో పొత్తా ” అన్న మాటలతో కేసీఆర్ తేల్చి చెప్పారు. టీడీపీకి అర శాతం.. ఒక శాతం ఓటింగ్ ఉంటుందని అడిగినా.. అడగకపోయినా… తేల్చి చెప్పారు. అలాంటి సందర్భంలో.. చంద్రబాబుతోనే తాను పోరాడుతున్నానని.. కలరింగ్ ఇవ్వడం వల్ల లాభం ఏమిటి..?
కూటమి గెలిస్తే చంద్రబాబు చేతిలో అధికారం ఉంటుందా..?
కనీసం ప్రత్యక్షంగా.. తెలంగాణ టీడీపీ వ్యవహారాల్లో కూడా పాలు పంచుకోని.. చంద్రబాబునాయుడు.. నిన్నామొన్నటి వరకు ప్రచారానికి కూడా వస్తానని చెప్పని.. చంద్రబాబునాయుడుని కేసీఆర్.. రేసులోకి తీసుకొచ్చారు. ఆయనతో తమ పోరాటం అన్నట్లు సీన్ క్రియేట్ చేసుకోవడంతో.. ఇప్పుడు ప్రచారం చేయడానికి కూడా సిద్ధమయ్యారు. నిజానికి మహాకూటమిలో.. టీడీపీ పాత్ర ఎంత. మహా అయితే పది శాతం. పదిహేను సీట్లు ఇవ్వడానికి కాంగ్రెస్ సిద్ధపడింది. ఇందులో రెండో… మూడో.. పాతబస్తీ లాంటిసీట్లు ఉంటాయి. నికంగా చెప్పాలంటే.. కేవలం పది అంటే.. పది స్థానాల్లో మాత్రమే.. టీడీపీ గట్టిగా పోటీ పడుతుంది. ఇంత మాత్రం దానికి టీడీపీ గెలిస్తే… చంద్రబాబు చేతిలో అధికారం ఉంటుందని… ఆయనే… పెత్తనం చెలాయిస్తారని ప్రచారం చేయడం వల్ల ఏమి ఉపయోగం ఉంటుంది…?
సీమాంధ్రుల్ని టీడీపీ వైపు నెట్టేస్తున్నారా..?
నిజానికి నిన్నామొన్నటి వరకు టీడీపీ క్యాడర్‌కు నాయకత్వం లేకుండా పోయింది. చంద్రబాబు పట్టించుకోలేదు. ఆయన ఏపీకి పరిమితమయ్యారు. తప్పని సరి పరిస్థితుల్లో ఇక టీఆర్ఎస్కే పరిమితం కావాల్సిన పరిస్థితులకు సీమాంధ్ర ఓటర్లు వచ్చారు. కానీ.. అనూహ్యంగా.. టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ కూటమిలో .. అదీ కూడా.. అధికారం చేజిక్కించుకోగలదు అన్న కూటమిలో భాగస్వామిగా చేరింది. టీఆర్ఎస్ నేతలు పదే పదే.. కూటమి గెలిస్తే.. చంద్రబాబుదే పెత్తనం అని ప్రచారం చేస్తున్నారు. టీఆర్ఎస్ చెబుతున్న ఈ మాటలు … సీమాంధ్ర ఓటర్లను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో.. చంద్రబాబు ప్రభావితం చేసే స్థాయిలో ఉంటే… టీడీపీకే ఎందుకు మద్దతివ్వకూడదన్న ఆలోచన… సీమాంధ్ర ఓటర్లలో ప్రారంభమయింది. దీనికి కారణం… టీఆర్ఎస్సే. చంద్రబాబు ప్రచారం తర్వాత..చెల్లా చెదురైన టీడీపీ క్యాడర్ మొత్తం.. ఏకమవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదంతా.. టీఆర్ఎస్ చేసుకుంటున్న స్వయంకృతం. దీని వల్ల మిగతా తెలంగాణ ప్రజల్ని సమీకృతం చేయగలుగుతున్నారా.. అంటే.. అదీ లేదని.. రిపోర్టులు తెలియచెబుతున్నాయి.
– సుభాష్