అయోధ్య వివాదాన్ని మళ్లీ లైవ్‌లోకి తెచ్చి ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించాలనుకున్న బీజేపీకి సుప్రీం కోర్టు పెద్ద షాక్ ఇచ్చింది. వివాదాస్పద భూమిని రామ్ లల్లా, సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహి అఖాడాలకు సమానంగా పంచుతూ అలహాబాద్ హైకోర్టు 2010లో తీర్పు సుప్రీంలో విచారణకు రాగా, అత్యున్నత న్యాయస్థానం దాన్ని నాలుగు నిమిషాల్లోనే తేల్చేసింది. అయోధ్య కేసులో ఒక బెంచ్ ఏర్పాటు చేసే విషయం జనవరిలో పరిశీలిస్తామని, ఇప్పటికిప్పుడు తొందరేమీ లేదని గొగోయ్ తేల్చిచెప్పారు. ఈ ఉత్తర్వులతో బీజేపీ గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయ్యింది. 2019 ఎన్నికల లోపు ఆలయ నిర్మాణం ప్రారంభించి హిందూ ఓటర్లను తమవైపుకు తిప్పుకోవాలని బీజేపీ భావించింది. అందుకే శబరిమల ఆలయం తరహాలో తీర్పు కావాలని యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ సహా పలువురు ఆదేశాల్లాంటి విజ్ఞప్తులు చేశారు.
కోర్టు ఉత్తర్వులపై కేంద్రమంత్రులు సైతం కొంత అసహనానికి లోనవుతున్నారు. అయోధ్య రామాలయ వ్యవహారాన్ని కాంగ్రెస్ పార్టీ హిందూ, ముస్లిం సమస్యగా చిత్రీకరించడం తగదని హింతూత్వ నేత గిరిరాజ్ కిశోర్ అన్నారు. హిందువులు సహనం కోల్పోతున్నారని, హిందూవులు అసహనానికి లోనైతే జరిగే విపత్కర పరిణామాలేమిటో తన ఊహకు కూడా అందడం లేదని గిరిరాజ్ అంటున్నారు. ఆలయ నిర్మాణం జాప్యం కావడంపై సాధు,సంతులు కూడా నిరాశ చెందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇంకెంత మాత్రం ఆలస్యం చేయకుండా ఆర్డినెస్ తీసుకురావాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది. శివసేన ఆర్డినెన్స్ డిమాండ్‌ను గట్టిగానే వినిపిస్తోంది. ఆరెస్సెస్ కూడా.. చట్టం తీసుకురావాలని కేంద్రాన్ని కోరింది.
ఆర్డినెన్స్ తీసుకువచ్చేందుకు ఇదే తగిన తరుణమని, రామమందిర నిర్మాణం మతసామరస్యానికి ప్రతీక అని చెబుతోంది. ఆర్డినెన్స్ తీసుకు రావాలన్నదే తమ అభిమతమని వీహెచ్‌పీ సైతం ప్రకటించింది. అయితే ఈ విషయంలో ఎలాంటి అడుగు వేస్తే… భావోద్వేగాలు రెచ్చగొట్ట వచ్చే… నరేంద్రమోడీ, అమిత్ షా అదే వ్యూహం అమలు చేసే అవకాశం ఉంది. అదేమిటన్నదానిపై.. త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.