అభ్యర్థులను ప్రకటించే సమయం దగ్గర పడుతుంటే కూటమి నేతల్లో టెన్షన్ మొదలైంది. కూటమిలోని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ టీడీపీల మధ్య కూడా కొన్ని సీట్ల విషయంలో అంగీకారం కుదరడం లేదు. సీట్లు ప్రకటిస్తే రగడ తప్పదని కాంగ్రెస్ నేతలు భయపడుతున్నారు. ముఖ్యంగా గ్రేటర్లో పరిస్థితి చాలా తేడాగా ఉంది. మా సిట్టింగ్ స్థానాలు మాకే ఇవ్వలంటూ.. రెండు పార్టీలు పట్టుబడుతున్నాయి. 2014 ఎన్నికల్లో టీడీపి హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల పరిధిలో 10 సీట్లు గెలుపొందింది..ఇందులో కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి,ఎల్బీనగర్,రాజేంద్రనగర్, మహేశ్వరం, జూబ్లీహిల్స్, కంటోన్మెంట్, సనత్ నగర్,ఖైరతాబాద్ స్థానాలు టీడీపీ కోరుతోంది. టీడీపీ కోరుతున్న స్థానాల్లోనే కాంగ్రెస్ కు బలమైన అభ్యర్థులున్నారు. ఈ సీట్ల ను వదులుకోవద్దని కాంగ్రెస్ నేతలపై ఒత్తిడి వస్తోంది.
కూకట్ పల్లి నుండి టీ టీడీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి పోటీ పడుతున్నారు. ఇక్కడ నుండి కాంగ్రెస్ నుండి పెద్దగా పోటీ లేదు..కానీ కుత్బుల్లాపూర్ లో కాంగ్రెస్ నుండి మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ గట్టిగా పట్టుబడుతున్నారు. ఈ విషయమై ఆయన అమరావతి కి వెళ్లి చంద్రబాబును కూడా కలిసి వచ్చారు. ఈ సీటు కోసం అవసరమైతే టీడీపీలో కూడా చేరేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. ఇక టీడీపీ గట్టిగా పట్టుబడుతోన్న మరో సీటు శేరిలింగంపల్లి. ఈ స్థానం నుండి చంద్రబాబు కు సన్నిహితంగా ఉండే తెలంగాణా వ్యాపారవేత్త పోటీ పడుతున్నారు. సిట్టింగ్ సీటు కావడంతో పాటు, సీమాంధ్ర ప్రాంత ఓటర్లు ఎక్కువగా ఉన్నారు కాబట్టి.. టీడీపీకి ఇస్తేనే గెలుపు సులువు అవుతుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. అయితే ఈ సీటు తనకే ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ పట్టుబడుతున్నారు. జూబ్లీహిల్స్ 2014లో టీడీపీ గెలుపొందింది. కానీ పీజేఆర్ కుమారుడికి మొండి చేయి చూపడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మనసు రావడం లేదు. ఖైరతాబాద్ సీటు విషయంలోనూ ఇదే పరిస్థితి.
మహేశ్వరం,ఎల్బీనగర్,రాజేంద్రనగర్ సీట్లు కూడా మా కంటే మాకని కాంగ్రెస్, టీడీపీ లు అంటున్నాయి.మహేశ్వరం నుండి సబితా ఇంద్రారెడ్డి, రాజేంద్రనగర్ నుండి సబిత కొడుకు కార్తీక్ రెడ్డి రంగంలోకి దిగాలని భావిస్తున్నారు.2009లో మహేశ్వరం నుండి సబిత గెలుపొందగా,2014లో టీడీపీ నుండి తీగల కృష్ణారెడ్డి గెలుపొందారు.రాజేంద్ర నగర్ నుండి ప్రకాశ్ గౌడ్ గెలిచారు..వీరిద్దరూ ఆ తర్వాత టిఆర్ఎస్ లో చేరిపోయారు..దీంతో ఈ రెండు తమ సీట్లేనని టీడీపీ అంటోంది..కనీసం ఈ రెండింటి లో ఏదో ఒకటి ఇవ్వాలని కోరుతున్నారు. దీంతో సబిత,కార్తీక్ లలో ఎవరో ఒకరు సీటు వదులుకోవడం తప్పనిసరి. సీట్ల పంపకాలు పూర్తయ్యే సరికి.. రెబెల్స్ తేలుతారేమోనని… కాంగ్రెస్ నేతలు కంగారు పడుతున్నారు.