కడప జిల్లా ప్రొద్దుటూరులో ఇవాళ్ల ధర్మ పోరాట దీక్ష సభ జరుగుతోంది. దీనికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరవుతున్నారు. నిజానికి, ఇది ఈ నెల 20నే జరగాల్సి ఉంది. కొన్ని కారణాల వల్ల దీన్ని 30వ తేదీకి వాయిదా వేశారు. అయితే, ఈలోగా ప్రతిపక్ష నేత జగన్ పై విశాఖ విమానాశ్రయంలో కత్తిదాడి ఘటన చోటు చేసుకుంది. అక్కణ్నుంచీ రాజకీయాల్లో ఇదే ప్రధాన చర్చగా మారిపోయింది. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రత్యేక హోదా, కేంద్రం పక్షపాత బుద్ధి… ఇలాంటి అంశాలన్నీ పక్కనపెట్టి, ప్రతిపక్ష పార్టీ రాజకీయమంతా ఆ దాడి ఘటన చుట్టూనే అన్నట్టుగా మారిపోయింది. అధికార పార్టీ కూడా ఎదురుదాడికి దిగుతూ… ఆ ఘటన చుట్టూనే ఆరోపణలూ ప్రత్యారోపణలు సాగుతున్నాయి.
ఇలాంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి బహిరంగ సభ జరగడం … అదీ జగన్ సొంత జిల్లాలో జరుగుతూ ఉండటంతో కొంత ఆసక్తి నెలకొంది. ప్రొద్దుటూరులో జరిగే ఈ సభను టీడీపీ శ్రేణులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దాదాపు 2 లక్షల మంది జనం వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. సభ ప్రాంగణంలో 50 వేల మంది కూర్చునే విధంగా ఏర్పాట్లు చేశారు. మొత్తంగా 96 ఎకరాల్లో సభా ప్రాంగణాన్ని సిద్ధం చేశారు. ఈ సభకు హాజరయ్యేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు మధ్యాహ్నం కడప విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడ్నుంచి మధ్యాహ్నం 2కి ప్రొద్దుటూరు చేరుకుని, సభలో పాల్గొంటారు.
కేంద్రం తీరుకి నిరసనగా జరుపుతున్న ఈ ధర్మాపోరాట సభలో ఈసారి ప్రతిపక్ష నేత దాడి అంశంపై కూడా ముఖ్యమంత్రి స్పందించే అవకాశం కనిపిస్తోంది. పైగా, జగన్ సొంత జిల్లాలో సభ కాబట్టి… చంద్రబాబు ప్రసంగం ఎలా ఉంటుందనే ఆసక్తి నెలకొంది. రాష్ట్ర పోలీసులు, దర్యాప్తు సంస్థలపై నమ్మకం లేదని జగన్ వ్యాఖ్యానించిన తీరుపై ప్రముఖంగా ప్రస్థావించే అవకాశం ఉంది. ఈ ఘటనను అడ్డు పెట్టుకుని రాజకీయంగా లబ్ధి పొందేందుకు వైకాపా చేస్తున్న ప్రయత్నాలపై ముఖ్యమంత్రి విమర్శల దాడి చేస్తారని స్థానిక టీడీపీ నేతలు అంటున్నారు.