రవితేజ కథానాయకుడిగా సంతోష్శ్రీనివాస్ దర్శకత్వంలో చిత్రం పట్టాలెక్కాల్సింది. ఈ సినిమాని మైత్రీ మూవీస్ సెట్ చేసింది. కానీ ఎందుకనో.. ఈ ప్రాజెక్ట్ పైప్ లైన్లోనే ఉండిపోయింది. దాంతో ఈసినిమా ఆగిపోయిందంటూ ప్రచారం మొదలైంది. దీనిపై మైత్రీ మూవీస్ స్పందించింది. ”ఈ కాంబినేషన్లో సినిమా వస్తుంది. డిసెంబరులో సినిమా మొదలయ్యే అవకాశాలున్నాయి. ‘తేరీ’ రీమేక్ అని ప్రచారం జరుగుతోంది. అది నిజమే. కానీ.. తేరీ సినిమాని యధాతథంగా రీమేక్ చేయడం లేదు. తేరీలో ఉన్న పాయింట్ ని మాత్రమే తీసుకున్నాం” అని క్లారిటీ ఇచ్చేసింది. మైత్రీ మూవీస్ నుంచి వస్తున్న ‘సవ్యసాచి’ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. వచ్చే నెలలో ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ కూడా విడుదలకు రెడీ అయ్యింది.
మైత్రీ మూవీస్ చేతిలో దాదాపు 14 సినిమాలున్నట్టు ఓ అంచనా. దీనిపై కూడా మైత్రీ స్పందించింది. ”మరీ 14 లేవు గానీ, ఓ పది వరకూ ఉన్నాయి. అయితే… అన్నీ ఒకేసారి మొదలవ్వలేవు కదా? ఒకసారి రెండు సినిమాల్ని మాత్రమే పట్టాలెక్కించగలం. ఇది వరకటితో పోలిస్తే.. ఇప్పుడు కాస్త స్పీడప్ అయ్యాం.. యేడాదికి కనీసం మూడు చిత్రాల్ని అందివ్వాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నాం” అంటున్నారు మైత్రీ మూవీస్ నిర్మాతలు.