తెలంగాణ ఎన్నికలలో టిడిపి సిపిఐ టిజెఎస్ కాంగ్రెస్ నాయకత్వాన మహా లేదా ప్రజా కూటమిలో చేరాయి. టిడిపి మాట బాగానే సాగుతున్నా అన్ని ఆలస్యాలను అవమానాలను భరించి సిపిఐ టిజెఎస్ కొనసాగుతున్నాయి. మరోవైపున సిపిఎం బిఎల్ఎప్ వేదికగా వంటరిగా అన్ని స్థానాల్లో పోటీ పెడుతున్నారు. దీనివల్ల టిఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు చీలిపోతాయని సిపిఎం వంటెత్తు పోకడ వల్ల నష్టమని మిగిలిన ప్రతిపక్షాలు అంటున్నాయి. అంతటితో ఆగక కొందరు నాయకులు ఇంకా ముందుకు వెళ్లి సిపిఎం లోపాయికారిగా టిఆర్ఎస్తో చేతులు కలిపిందని ఆరోపిస్తున్నారు. ఈ విషయమై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆసక్తికరమైన ప్రశ్నతో సమాధానమిచ్చారు.మేము అప్పుడు మాకున్న రాజకీయ అంచనా మేరకు టిడిపి వంటి పార్టీలతో పొత్తు పెట్టుకుంటే సీట్ల కోసం సిద్ధాంతం తాకట్టు పెట్టామని ఆరోపించారు. ఇప్పుడు ఎవరితో ఎలాటి బంధంలేకుండా వంటరిగా అన్ని చోట్ల పోటీ చేస్తే ఇప్పుడు కూడ కుమ్మక్కయ్యామని నిందలేస్తున్నారు. ఏది చేసినా తప్పేనా? అని ఆయన అడిగారు. ప్రధాన శత్రువును ఓడించడం కోసం పొత్తులు సర్దుబాట్లు చేసుకోవడం వల్ల మరెవరో అధికారంలోకి వచ్చారు తప్ప తాము నష్టపోవడమే జరిగిందని ఆయన స్పష్టం చేస్తున్నారు. కాబట్టే ఎవరినో గెలిపించాలని లేదా ఓడించాలని గాక మా బలం మేరకు మేము అన్ని చోట్ల పోటీ చేస్తాం. ఆరోపణలు చేసేవారు చేస్తూనే వుంటారని అన్నారు.