కెసిఆర్ అనే పదానికి కొత్త నిర్వచనాన్ని ఇచ్చారు ఆయన తనయుడు కేటీఆర్. కామారెడ్డి జిల్లాలో పర్యటించిన కేటీఆర్ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మాట్లాడుతూ ఈ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్ అంటే కాల్వలు, చెరువులు ,రిజర్వాయర్లు అని తాను చెప్పడం కాదని ప్రజలు కూడా ఇదే అనుకుంటున్నారని కేటీఆర్ అన్నారు.
తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు అందించే బృహత్తర ప్రయత్నంలో కెసిఆర్ ఉన్నారని, అయితే ఆ ప్రయత్నాలకు కాంగ్రెస్ నేతలు అడ్డుపడుతున్నారని, కాంగ్రెస్ నేతలు అలా అడ్డు పడటం వల్లే ఎల్లారెడ్డి నియోజకవర్గంలో సమస్యలు మిగిలిపోయాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అయితే తెలంగాణను సస్యశ్యామలం చేసేంతవరకు కేసీఆర్ కృషి చేస్తూనే ఉంటారని, అందుకే కెసిఆర్ అంటే కాల్వలు, చెరువులు, రిజర్వాయర్లు అని ప్రజలు అనుకుంటున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
సహజంగానే మంచి మాటకారి అయిన కేటీఆర్ మరొకసారి తన వాక్చాతుర్యాన్ని అలా ప్రదర్శించారు. ఎన్నికల సీజన్లో ఇలాంటి మరిన్ని నిర్వచనాలు, మరిన్ని పదప్రయోగాలు వచ్చే అవకాశం ఉంది.