వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి.. పూర్తిగా కోలుకోవడానికి ఆరు వారాల సమయం పడుతుదని.. ఆయనకు వైద్యం చేస్తున్న సిటీ న్యూరో ఆస్పత్రి వైద్యులు శివారెడ్డి తేల్చారు. అర సెంటిమీటర్ గాయానికి ఆపరేషన్ చేసి.. తొమ్మిది కుట్లు వేసిన.. డాక్టర్ శివారెడ్డి.. ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న జగన్మోహన్ రెడ్డిని మరో సారి పరీక్షించారు. జగన్ కోలుకుంటున్నారని నిర్ధారించారు. పూర్తి స్థాయిలో కోలుకోవడానికి ఆరు వారాల సమయం పడుతుందని.. ఆ మేరకు విశ్రాంతి తీసుకోవాలని మెడికల్ ఎడ్వైజ్ ఇచ్చారు. జగన్ కు గుచ్చిన కోడి కత్తికి.. ఎలాంటి విష పదార్థమూ పూయలేదన్న నివేదిక వచ్చిందన్నారు. అయితే కత్తి అల్యూమినీయంతో చేసినందున.. ఆ అల్యూమినీయం రక్తంలో కలిసిందని.. అందుకే రక్తంలో అల్యూమినీయం శాతం ఎక్కువగా ఉందని.. డాక్టర్లు చెప్పుకొచ్చారు.
మరో వైపు.. వైసీపీ నేతలు..ఢిల్లీలో జాతీయ పార్టీల నేతలను కలుస్తున్నారు. వైఎస్ జగన్ పై జరిగిన దాడి గురించి.. ఏపీ ప్రభుత్వం వ్యవహరించిన విధానంగా గురించి వివరిస్తున్నారు. రాష్ట్రపతి అపాయింట్ మెంట్ కోసం.. వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. అపాయింట్ మెంట్ ఇచ్చిన వెంటనే రాష్ట్రపతిని కూడా కలిసి.. ఏపీ ప్రభుత్వంపై ఫిర్యాదు చేయనున్నారు. వైసీపీ నేతలకు కౌంటర్ గా టీడీపీ నేతలు…కూడా రివర్స్ ఆరోపణలు చేస్తున్నారు. అంతా డ్రామా ఆడుతున్నారని కొట్టి పడేస్తున్నారు. పాదయాత్రలో ప్రజాదరణ లేదని… సానుభూతి డ్రామాలు ఆడుతున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు.
డాక్టర్లు ప్రకటనతో… జగన్ పాదయాత్ర డొలాయమానంలో పడింది. గత గురువారం. మరో రెండు రోజుల్లో… పాదయాత్ర ప్రారంభమవుతుదని చెప్పారు. ఆ తర్వాత వచ్చే నెల రెండో తేదీ నుంచి ప్రారంభిస్తారని వైసీపీ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. కానీ ఇప్పుడు డాక్టర్లు ఆరు వారాల విశ్రాంతి సూచించడంతో… పాదయాత్ర మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. భుజం కదిలించవదద్దని డాక్టర్లు చెప్పారని.. ఇలాంటి పరిస్థితుల్లో పాదయాత్ర వద్దని జగన్ కుటుంబసభ్యులు సలహాలిస్తున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.