తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంతో తెరాస దూసుకుని పోతోంది. ఒక పక్క మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ లు ప్రతీరోజూ సభలూ సమావేశాల్లో పాల్గొంటూ బిజీబిజీగా ఉన్నారు. ఇంకోపక్క, ఇప్పటికే తెరాస అభ్యర్థుల జాబితా ప్రకటించేయడంతో ఆయా నియోజక వర్గాల్లో అభ్యర్థులూ తీవ్రంగానే ప్రచారం చేస్తున్నారు. అయితే, మహా కూటమి అభ్యర్థులే ఇంకా పూర్థిస్థాయిలో ప్రచారానికి దిగలేకపోతున్నారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ప్రచారం ఎప్పుడో మొదలుపెట్టేసింది. కానీ, ఆ పార్టీ పోటీ చేసే స్థానాలు, మిత్రపక్షాలకు ఇచ్చే సీట్లపై ఇంకా స్పష్టత రాలేదు కాబట్టి… ప్రచారం కూడా అంతంత మాత్రంగానే సాగుతోందని చెప్పొచ్చు. ఇప్పటికే మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో ఒక ప్రచారం బృందం రంగంలో ఉన్నా… కొన్ని నియోజక వర్గాల్లో మహా కూటమికి చెందిన ఏ పార్టీ అభ్యర్థులు బరిలోకి దిగుతారో అనే స్పష్టత లేక ఏమీ చెయ్యలేని పరిస్థితి కూడా ఎదురౌతోంది.
కాంగ్రెస్ పార్టీలో సీట్ల సర్దుబాటు కూడా నవంబర్ తొలివారం వరకూ స్పష్టత వచ్చే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. కూటమిలోని పార్టీలకు ఇవ్వాల్సిన టిక్కెట్లపై కూడా ఇంకా పూర్థి స్థాయి స్పష్టత రాలేదనీ, భాగస్వామ్య పక్షాలతో చర్చలు జరుగుతున్నాయనే పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక, ఈ ప్రక్రియ ఆసల్యం కావడంతో ఎన్నికల ప్రచారంలో గందరగోళం నెలకొన్న పరిస్థితి కూడా తలెత్తుతోంది. హైదరాబాద్ లో ఉప్పల్, ఎల్బీ నగర్, జూబ్లీ హిల్స్, శేర్లింగంపల్లి వంటి నియోజక వర్గాల్లో మహా కూటమిలోని అన్ని పార్టీల వారూ ప్రచారంలో కనిపిస్తున్నారు! కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్.. ఈ మూడు పార్టీల ఆశావహులూ ప్రచారంలో తిరుగుతున్నారు. అంతేకాదు… తమకే టిక్కెట్ వస్తుందనీ, తమ పార్టీకే ఓటెయ్యాలంటూ ఎవరికివారు ప్రచారం చేసుకుంటున్న పరిస్థితి. కొన్ని నియోజక వర్గాల్లో తెరాస వెర్సెస్ మూడు పార్టీల అభ్యర్థులూ కనిపిస్తున్న వైనమూ ఉంది!
మహా కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై స్పష్టత వచ్చే వరకూ ఈ గందరగోళం కొనసాగేట్టే కనిపిస్తోంది. అయితే, ఈ క్రమంలో రెండు సమస్యలున్నాయి. మొదటిది.. కూటమి అభ్యర్థి ఎవరు, తెరాసకు వ్యతిరేకంగా పోటీ చేస్తున్న పార్టీ ఏదనేది ప్రజలకు స్పష్టంగా చెప్పలేకపోవడం. రెండోది… అభ్యర్థులను ప్రకటించిన తరువాత ఇప్పటికే టిక్కెట్ దక్కుతుందన్న ధీమాతో ప్రచారం చేస్తున్న పార్టీల అభ్యర్థుల నుంచి వ్యతిరేకత ఉండే ఆస్కారం ఉంది. సీట్ల సర్దుబాట్లు ఆలస్యంగా చెయ్యడం ద్వారా కాంగ్రెస్ ఆశిస్తున్న ప్రయోజనాలు ఏవైనా ఉండొచ్చుగానీ… మరీ ఆలస్యం చేస్తే ఈ తరహా వ్యతిరేకతను డీల్ చెయ్యాల్సిన పరిస్థితి ఎదుర్కొనాల్సి రావొచ్చు.