భారతీయ జనతా పార్టీకి ప్రత్యామ్నాయాన్ని సిద్ధం చేయాలన్న పట్టుదలతో ఉన్న… టీడీపీ అధినేత చంద్రబాబు… జాతీయ మహాకూటమిని.. రెడీ చేసేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీకి దగ్గరవుతున్నట్లుగా ఉన్న బీఎస్పీని.. గత పర్యటనలో… కాంగ్రెసేతర, బీజేపీయేతర కూటమి దిశగా మరల్చడంలో కొంత మేర సక్సెస్ అయ్యారు. ఈ ప్రయత్నాలను ఇక ముందు కూడా కొనసాగించబోతున్నారు. గురువారం మరోసారి ఢిల్లీ వెళ్తున్నారు. శరద్ పవార్ తో పాటు కమ్యూనిస్టు పార్టీల అగ్రనేతలతో చర్చలు జరపనున్నారు. అదే సమయంలో.. మరికొన్ని ప్రాంతీయ పార్టీలతోనూ ఆయన చర్చలు జరిపే అవకాశం ఉంది.
నిన్న ఎస్పీ అధ్యక్షుడు యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ చంద్రబాబుకు ఫోన్ చేశారు. కాంగ్రెస్ సహా అన్ని విపక్షాలను ఒకే వేదికపైకి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని చంద్రబాబుతో అఖిలేశ్ చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే బాధ్యత మనపై ఉందన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలన్నీ ఒకే వేదికపైకి రావాలని, జాతీయస్థాయిలో ఉన్న పలుకుబడితో పార్టీలను ఏకం చేయాలని చంద్రబాబును అఖిలేశ్ కోరారు. నిరంకుశ పోకడల నుంచి దేశాన్ని కాపాడాలన్నారు. లౌకికవాదం ప్రమాదంలో పడిందని, ప్రజాస్వామ్య విలువలు కాపాడాలని అఖిలేశ్ అభిప్రాయపడ్డారు. చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలకు సమాజ్‌వాదీ నుంచి సహకారం ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.
జనవరి కల్లా… ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి… ఓ కూటమిని తయారు చేయడమే లక్ష్యంగా చంద్రబాబు పెట్టుకున్నారు. ఇప్పటికే.. ఈ విషయంలో అంతర్గతంగా చాలా వరకు సక్సెస్ సాధించారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఈ విషయంలో చంద్రబాబుకు కొన్ని సూచనలు, సలహాలు కూడా ఇస్తున్నారు. ప్రాంతీయ పార్టీలకు నాయకత్వం వహించే విషయంలో ఇతర నేతలపై ఒకరికొకరికి అభ్యంతరాలు ఉంటాయి కానీ.. చంద్రబాబుపై మాత్రం ఉండవు. ఈ ప్లస్ పాయింట్‌తోనే మమతా బెనర్జీ ముందుగా పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు చంద్రబాబును పురమాయించారు. ఈ ప్రాంతీయ పార్టీలన్నీ.. ఓ కూటమిగా ఏర్పడి.. జనవరిలో బీజేపీని సవాల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.